న్యూఢిల్లీ: సుప్రీకోర్టు ఆధార్ విషయంలో మరోసారి కేంద్రానికి ఝలక్ ఇచ్చింది. పాన్‌కార్డ్‌తో ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఆదాయ పన్ను దాఖలుకు ఆధార్ నెంబర్ అనుసంధానం మాండేటరీ కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) తో ఆధార్ సంఖ్యను అనుసంధానిస్తూ ఆదాయ పన్ను చట్టంలో కొత్తగా చేర్చిన నిబంధనను సుప్రీం సమర్థించింది. అయితే ఈ విషయంలో ప్రజలను బలవంతం చేయడం తగదని సూచించింది.
ఆధార్-పాన్ లింకేజ్ స్వచ్ఛందంగా ఉండాలనే వాదనను ధర్మాసనం తిరస్కరించింది. అలాగే ఆధార్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులను రద్దు చేసే ఆలోచనను సుప్రీం తప్పుపట్టింది. ఇది తీవ్ర పరిణామాలను దారి తీస్తుందని హెచ్చరించింది. మే 4 వ తేదీన జస్టిస్ ఎకె సిక్రి, అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం తాజా బడ్జెట్, ఆర్థిక చట్టం, 2017 ద్వారా ప్రవేశపెట్టిన ఇన్ కం టాక్స్ (ఐ-టి) చట్టం 139ఏఏ సెక్షన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనను నేటికి వాయిదా వేసింది. ఆధార్ లేకపోయినా కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.
కాగా సవరించిన ఆర్థికబిల్లులో బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్ కు కేంద్రం ఆధార్ నంబర్ ను తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు పాన్‌తో ఆధార్ అనుసంధానాన్ని జులై 1 నుంచి తప్పనిసరి చేసింది. అయితే దీనిపై వ్యతిరేకతలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.