ఐటీ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం యాక్సెంచర్ గత కొద్ది వారాలుగా తమ సిబ్బందిలో అత్యధిక శాతం మందికి ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు.. బోనస్‌లు చెల్లించినట్లు తెలుస్తోంది. దేశీయంగా కంపెనీకున్న 2,00,000 మంది ఉద్యోగులలో సగానికంటే ఎక్కువమందికి ప్రమోషన్లు, బోనస్‌లు లభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఐటీ సర్వీసుల రంగంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించడం ద్వారా యాక్సెంచర్ సైతం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఏడాదికి కనీసం 2,500 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తోంది. సుమారు 45 లక్షల మంది ఉద్యోగులకు ఆవాసమైన దేశీ ఐటీ రంగం సగటున నెలకు 20,000 కొత్త ఉద్యోగాలకు దారి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో 2020 మార్చితో ముగిసిన గతేడాదిలోనూ 2.05 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించినట్లు ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్‌కామ్ వెల్లడించింది.
కొత్త వారికి సై
గత కొద్ది రోజుల్లో కొత్తగా ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నట్లు యాక్సెంచర్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అంతేకాకుండా కంపెనీలో చేరిన మరుక్షణం నుంచీ అన్ని రకాల వేతన సౌకర్యాలూ అందించనున్నట్లు తెలియజేశారు. కాగా.. కోవిడ్-19 విస్తృతి, లాక్‌డవున్ ప్రభావంతో బిజినెస్‌లు మందగించడంతో పలు కంపెనీలు సిబ్బంది కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఐటీ రంగంలోనూ కొన్ని కంపెనీలు వేతన పెంపును నిలిపివేయడంతోపాటు.. ప్రమోషన్లను వాయిదా వేశాయి. ఇప్పటికే ఆఫర్ లెటర్లు జారీ చేసిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు దేశీ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. అయితే వేతన పెంపు, ప్రమోషన్లను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఇటీవల ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. వ్యయాల అదుపునకు ఇతర చర్యలను సైతం చేపడుతున్నట్లు తెలియజేసింది. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. కాగా.. జూనియర్ స్థాయి ఉద్యోగులకు విధానాలకు అనుగుణంగా వేతన చెల్లింపులను చేపడుతున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే అత్యున్నత, సీనియర్ స్థాయిలో పనితీరు ఆధారంగా ఇచ్చే వేతన చెల్లింపులలో కోత పెడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఇక ఫ్రెంచ్ కంపెనీ క్యాప్‌జెమినీ.. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్‌లను చెల్లిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. మొత్తం సిబ్బందిలో 70 శాతంవరకూ లబ్ది పొందినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment