రాందేవ్ బాబాకు ఝలక్
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబా కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి పై ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ) భారీ ఝలక్ ఇచ్చింది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసింది. తనకు అందిన సుమారు 156 ఫిర్యాదులపై విచారించి ఈ ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్‌ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లెటర్ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పతంజలి కచ్చి ఘనీ మస్టర్డ్ ఆయిల్, కేశ్ కాంతి న్యాచురల్ హెయిర్ క్లెన్సర్ తదితర ప్రకటలపై సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్‌ఈ) గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తప్పుడు ప్రచారం ద్వారా పతంజలి ఆయుర్వేద వినియోగదారుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే పతంజలి ఆయుర్వేద సంస్థ మాత్రం తన ప్రచారాన్ని గట్టిగానే సమర్ధించుకుంది. వాస్తవాలు, పరిశోధనల ఆధారంగానే తమ ప్రచారాన్ని రూపొందించామని, ఎవరినీ తప్పుదారి పట్టించే ఆలోచన లేదంటూ వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామంపై పతంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి.