అడ్వర్టైజ్ మెంట్ రంగంలో చెరగని ‘ముద్ర’.. ఏజీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ అడ్వర్‌టైజ్‌మెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేక ‘ముద్ర’ ఏర్పర్చుకున్న ఆచ్యుతిని గోపాల కృష్ణమూర్తి (ఏజీకే) తన క్రియేటివిటీతో కార్పొరేట్లు, వినియోగదారుల్ని 80,90 దశకాల్లో మంత్రముగ్ధుల్ని చేశారు. శుక్రవారం కన్నుమూసిన ఏజీకే.. ముద్రా కమ్యూనికేషన్స్ పేరుతో దేశీయ ప్రకటనల రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1942 గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన ఆయన రిలయన్స్, విమల్, రస్నా వంటి బ్రాండ్స్‌కు ప్రాచుర్యం కల్పించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 35 ఏళ్ల క్రితం ఆయన సృష్టించిన ‘ఓన్లీ విమల్’, ‘ఐ లవ్ యూ రస్నా’ ట్యాగ్ లైన్లు ఇప్పటికీ ప్రజల నోటిలో నానుతున్నాయంటే అవి ఎంత చెరగని ముద్ర వేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.
1972లో శిల్పి అడ్వర్‌టైజ్‌మెంట్ సంస్థలో అకౌంటెంట్‌గా వృత్తిని ఆరంభించారు. ఆ తర్వాత అనతి కాలంలోనే 1976లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అడ్వర్‌టైజ్‌మెంట్ మేనేజర్‌గా చేరి నప్పటి నుంచి ఏజీకే ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఏజీకేలో వున్న క్రియేటివిటీని గుర్తించిన రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ...ఆయన స్వంతంగా ఒక ఏజెన్సీ పెట్టుకునేందుకు ప్రోత్సాహాన్నందించారు. 1980లో రూ. 35,000 పెట్టుబడితో ముద్రా కమ్యూనికేషన్స్ పేరుతో సొంతంగా తనకిష్టమైన అహ్మదాబాద్‌లో చిన్న యాడ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రాంతీయ సంస్థగా మొదలైన ముద్రా అనతి కాలంలోనే దేశీయ అడ్వర్‌టైజ్‌మెంట్ సంస్థల్లో టాప్-3గా నిలిచింది. ఆ తర్వాత ఆసియాలోనే తొలి అడ్వర్‌టైజ్‌మెంట్ శిక్షణా సంస్థను ‘ ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్’ పేరుతో 1991లో ప్రారంభించారు. ప్రకటనల రంగంలో ఈ సంస్థ 800కిపైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఆరేళ్లపాటు ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డులను అందుకుంది.
2003లో ముద్రా నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ఏజీకే బ్రాండ్ కన్సల్టెన్సీ పేరుతో మరో సంస్థను ప్రారంభించి దానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రకటనల రంగంలోనే కాకుండా రచనలతోనూ అనేకమందికి స్ఫూర్తినిచ్చారు. ముఖ్యంగా ధీరూభాయ్ అంబానీ జీవన శైలి, అడ్వర్‌టైజ్‌మెంట్ ప్రాక్టీసెస్, వ్యక్తిత్వ వికాసాలపై అనేక రచనలు చేశారు. 2013లో ‘ఇఫ్ యూ కెన్ డ్రీమ్’ పేరుతో విడుదలైన ఆటో బయోగ్రఫీ ఆయన చివరి రచనగా చెప్పుకోవచ్చు. ఈ రంగంలో చేసిన కృష్టికి అనేక అవార్డులు, రివార్డులను అందుకున్నారు. వీటిలో ఏఏఏఐ-ప్రేమ్ నారాయణ్ అవార్డు, అడ్వర్టైజింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ వంటివి ఉన్నాయి. ఏజీకేకి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఏజీకే మృతిపట్ల కార్పొరేట్ రంగ ప్రతినిధులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.