న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో ఇండియన్ ఆయిల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా మెరుగైన పనితీరు కనపర్చాయి. అత్యధిక లాభాలు ఆర్జించిన టాప్ 3 సంస్థలుగా నిల్చాయి. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిరిండియా, ఎంటీఎన్‌ఎల్ మాత్రం భారీ నష్టాలతో అధ్వాన్న పనితీరు చూపాయి.
2016–17 ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) పనితీరుపై కేంద్రం నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మంగళవారం దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సర్వే నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం నష్టాలు నమోదు చేసిన 82 కంపెనీల మొత్తం నష్టాల్లో టాప్ 10 సంస్థల వాటా ఏకంగా 84 శాతం మేర ఉంది. ఇక ఈ టాప్ 10 సీపీఎస్‌ఈల నష్టాల్లోనూ బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిరిండియా, ఎంటీఎన్‌ఎల్ వాటానే 56 శాతంగా ఉంది.
లాభాల్లోకి హెచ్‌పీసీఎల్, ఎంఆర్‌పీఎల్..
2016–17లో అత్యధికంగా లాభాలు ఆర్జించిన అగ్రశ్రేణి 10 కంపెనీల మొత్తం లాభాల్లో ఇండియన్ ఆయిల్ వాటా సుమారు 20 శాతం, ఓఎన్‌జీసీ 18 శాతం, కోల్ ఇండియా వాటా సుమారు 15 శాతం ఉంది. టాప్ 10 లాభసాటి సీపీఎస్‌ఈల జాబితాలో కొత్తగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) వచ్చి చేరాయి. అయితే, హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాత్రం లిస్టులో స్థానం కోల్పోయాయి.
174 లాభసాటి సీపీఎస్‌ఈల మొత్తం లాభాల్లో టాప్ 10 కంపెనీల లాభాల వాటా సుమారు 64 శాతంగా ఉంది. 2015–16లో నష్టాలు నమోదు చేసిన హిందుస్తాన్ కేబుల్స్, భెల్, ఓఎన్‌జీసీ విదేశ్ సంస్థలు మళ్లీ గత ఆర్థిక సంవత్సరంలో లాభాల్లోకి మళ్లాయి. అయితే వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, ఎస్‌టీఎస్‌ఎల్, ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ తదితర సంస్థలు టాప్ 10 నష్టాల సీపీఎస్‌ఈల జాబితాలో చేరాయి. 2016– 17లో మొత్తం 257 పీఎస్‌యూల నికర లాభం రూ. 1,27,602 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ. 1,14,239 కోట్లతో పోలిస్తే 11.7 శాతం వృద్ధి నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment