ఎయిరిండియాను అమ్మినా.. ఎవరూ కొనరు!
♦ కంపెనీ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది...
♦ అయినా, డిజిన్వెస్ట్‌మెంట్ ప్రసక్తే లేదు...
♦ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పీకల్లోతు నష్టాలు, భారీ రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను ప్రభుత్వం అమ్ముదామనుకున్నా కొనేవారు ఎవరూ ఉండరని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటమే దీనికి కారణమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియాలో వాటాను విక్రయించే(డిజిన్వెస్ట్‌మెంట్) అవకాశాలేవీ లేవన్నారు. సంస్థను గట్టెక్కించడం కోసం ఎల్లకాలం పన్ను చెల్లింపుదారుల సొమ్ము(ప్రభుత్వ నిధులు)ను వెచ్చించడం కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం తర్వాత నుంచి ఎయిరిండియా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ప్రస్తుతం సంస్థ మొత్తం రుణ భారం రూ.50,000 కోట్లుగా అంచనా.
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎయిరిండియాకు రూ.30,000 కోట్ల మేర సహాయ ప్యాకేజీని అందించారు. ఇతరుల మాదిరిగా తాను ఎయిరిండియాను నిందించేపని చేయబోనని.. అయితే, కంపెనీ టర్న్‌అరౌండ్ లక్ష్యాలు సాకారం కావాలంటే నిర్వహణ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అశోక్ గజపతి పేర్కొన్నారు. కాగా, దేశీ విమానయాన రంగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం వచ్చే నాలుగేళ్లలో ఎయిరిండియా కొత్తగా 100 విమానాలను సమకూర్చుకోవాలని భావిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటనా ఇంకా వెలువడనప్పటికీ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.6-8 కోట్ల మేర నిర్వహణ లాభాలను నమోదు చేసినట్లు సమాచారం. అయితే, నికర నష్టం మాత్రం రూ.2,636 కోట్లుగా అంచనా. 2014-15 ఏడాది నష్టం రూ.5,859 కోట్లతో పోలిస్తే ఇది 60 శాతం తగ్గడం గమనార్హం. ఎయిరిండియాకు మళ్లీ ఆర్థికంగా మంచి రోజులు వస్తాయన్న పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు.
టారిఫ్‌లపై పరిమితులేవీ ఉండవు...
ఎయిర్‌లైన్ కంపెనీలు ఇష్టానుసారంగా టారిఫ్‌లు పెంచేస్తున్నాయన్న ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో... టిక్కెట్ చార్జీలపై ప్రభుత్వం పరిమితులు విధించనుందన్న వార్తలను మంత్రి అశోక్ గజపతి రాజు కొట్టిపారేశారు. కంపెనీల మధ్య పోటీ పెరిగితే టిక్కెట్ రేట్ల పెరుగుదల సమస్యకు అడ్డుకట్టపడుతుందన్నారు. ‘టారిఫ్‌లను నియంత్రించడం వ్యాపారపరంగా మంచిది కాదు. ప్రాంతీయంగా మరిన్ని పట్టణాలకు విమానయాన సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ విధమైన నియంత్రణ చర్యలు దెబ్బతీస్తాయి. లాభదాయకంకాని రూట్లలో విమాన సర్వీసులను నడిపేందుకు ఎయిర్‌లైన్ సంస్థలు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే, ప్రయాణికుల సమస్యలు, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేదిశగా తగిన యంత్రాంగాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆర్థిక మంత్రి జైట్లీతో భేటీ...
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో అశోక్ గజపతి రాజు గురువారం సమావేశమయ్యారు. పౌరవిమానయాన పాలసీ ముసాయిదాకు ఆమోదంపై త్వరలో కేబినెట్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. విమానయాన రంగాన్ని పటిష్టం చేయడంపై జైట్లీతో చర్చించినట్లు సమావేశం అనంతరం అశోక్ గజపతి ట్వీట్ చేశారు. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీకి నిధుల కోసం అన్ని రకాల విమాన టికెట్లపై 2 శాతం పన్ను, ఎయిర్‌లైన్స్‌కు పన్ను రాయితీలు ఇతరత్రా పలు ప్రతిపాదనలు పాలసీలో ఉన్నాయి.