
ఎయిర్ ఇండియా ఉద్యోగుల జీతాలు?
ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు. ఒకవైపు అప్పుల భారంతో కునరిల్లుతున్న సంస్థను ప్రయివేటు పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు సంక్షోభంలో ఉన్న సంస్థ ఖర్చులు తగ్గించుకునేందుకు అష్టకష్టాలుపడుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దీంతో వేలమంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
జూలై నెలలో ఎయిర్ ఇండియా ఉద్యోగులకు జీతాలు చెల్లింపును ఆలస్యం చేసిందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. వీటిని వచ్చే వారం చెల్లించే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. అయితే ఈ ఆలస్యానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగాఎలాంటి ప్రకటన రాలేదని ఆయన చెప్పారు. దీంతో ఇప్పటికే ప్రయివేటైజేషన్‌కు వ్యతిరేకంగా, ఉద్యోగభద్రతపై ఆందోళనలో పడిన ఉద్యోగులు ఇపుడు మరింత కలవర పడుతున్నారు. ఎయిర్‌ఇండియాలో సుమారు 21,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
కాగా మునుపటి యుపిఎ ప్రభుత్వం 2012లో పది సంవత్సరాల కాల వ్యవధిలో రూ.30 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అందించింది. రూ. 50,000 కోట్ల రుణ భారంతో ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి ఇటీవల కేంద్ర క్యాబినెట్ సూత్ర ప్రాయ అంగీకారం చెప్పింది. సంస్థలోని పెట్టుబడుల ఉపసంహరణపై ఏర్పాటు చేసిన మంత్రత్వి కమిటీ తీవ్రంగా పని చేస్తోంది. అటు ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఇండిగో, టాటా గ్రూప్ ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.