న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ స్థానిక నగరాల నుంచి ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రాంతాలకు విమాన టిక్కెట్లను కేవలం రూ.3,399కే అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 15 వరకు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్‌ఏషియా ప్రకటించిన ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల సేల్ ప్రయాణ కాలం 2019 ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమై 2019 ఆగస్టు 13 వరకు ముగియనుందని ఎయిర్‌ఏషియా.కామ్‌లో వెల్లడించింది. న్యూఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్ వంటి నగరాల నుంచి వీటి విమానాలు బయలుదేరతాయి. కౌలాలంపూర్, క్రాబీ, హనోయి, ఆక్లాండ్ వంటి దేశాలకు ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. ఎంబార్గో కాలాల్లో ఈ ధరలు అందుబాటులో ఉండవు.
తక్కువ ధరకే ఎయిర్‌ఏషియా విమాన టిక్కెట్ ఆఫర్..
విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ వరకు అంతర్జాతీయ విమాన టిక్కెట్లను ఎయిర్‌ఏషియా తన సేల్ కింద అత్యంత తక్కువగా రూ.3,999కే అందిస్తోంది. క్రెడిట, డెబిట్, ఛార్జ్ కార్డుల ద్వారా పేమెంట్లు జరిపే వాటికి నాన్-రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ ధరలోనే ఎయిర్‌పోర్టు పన్నులు కలిసి ఉంటాయి. అయితే డిపార్ట్చర్ సమయంలో సేకరించే ఎయిర్‌పోర్టు పన్నులు దీనిలో ఉండవు. సీట్లు కూడా పరిమితమే. అన్ని ఎయిర్‌ఏషియా విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు.
ఈ సేల్ కింద అమృత్‌సర్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలంటే విమాన టిక్కెట్‌ను రూ.4,490కు అందిస్తుంది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్‌కు, సింగపూర్‌కు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.6,436కు ప్రారంభమవుతుంది. కోల్‌కతా నుంచి కౌలాలంపూర్, పెర్త్‌లకు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.11,355 నుంచి ఉంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్, సిడ్నీలకు రూ.3,497, న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్, బ్యాండంగ్‌కు రూ.8,730, బెంగళూరు నుంచి కౌలాలంపూర్, మెల్‌బోర్న్‌కు రూ.14,999కు విమాన టిక్కెట్లను ఎయిర్‌ఏషియా విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment