
ఐఏఎఫ్‌కు ఎయిర్‌బస్-టాటా బిడ్
ఎయిర్‌బస్ సీ295 విమానాల సరఫరా
న్యూఢిల్లీ: కాలపరిమితి ముగుస్తున్న ఏవ్రో ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్)కు ఎయిర్‌బస్ సీ295 రవాణా విమానాలను సరఫరా చేసేందుకు ఎయిర్‌బస్‌తో టాటా జత కట్టింది. తద్వారా 56 విమానాల సరఫరాకు సంయుక్త బిడ్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్ తొలి 16 విమానాలను సరఫరా చేయనుంది. ఆపై మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్(టీఏఎస్) తయారీ, అసెం బ్లింగ్ ద్వారా అందిస్తుంది.
ప్రధానంగా విడిభాగాలను అసెంబ్లింగ్ చేయడం, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, దేశీ పరికరాల పరిశీలన, నిర్వహణ వంటి కార్యక్రమాలను టీఏఎస్ చేపడుతుంది. తగిన పరిశీలన, పటిష్ట పరిశోధన చేశాక ఈ ఒప్పందానికి టీఏఎస్‌ను దేశీ ఉత్పాదక సంస్థగా ఎంపిక చేసుకున్నట్లు ఎయిర్‌బస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏవ్రో విమానాలను ఐఏఎఫ్ తొలిసారి 1960లో అందుకుంది.