ఎయిర్ సెల్-మ్యాక్సిస్ డీల్పై స్పందించిన చిదంబరం
Published Tue, Apr 4 2017 3:49 PM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM
నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్ కు ఆమోదం తెలిపారని తనపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. సాధారణ వ్యాపారాలకు మాదిరిగానే ఎయిర్ సెల్- మ్యాక్సిస్ డీల్ కు ఆమోదముద్ర వేసినట్టు చిదంబరం మంగళవారం చెప్పారు. కాగ విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) నిబంధనల ఉల్లంఘనలో ఆర్థికమంత్రిగా చిదంబరం పాత్రపై దర్యాప్తు జరిపిన ఈడీ, ఆ నివేదికను నిన్న సుప్రీంకోర్టుకు అందజేసింది. ''ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో విదేశీ ఇన్వెస్ట్మెంట్ల విలువ బట్టి, ఎఫ్ఐపీబీ ఆ డీల్ ఆమోదం కోసం ఆర్థికమంత్రి ముందుకు తీసుకొచ్చింది. ఆర్థికమంత్రిగా నేను సాధారణ వ్యాపారాలకు ఆమోదం ఇచ్చిన మాదిరిగానే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను'' అని చిదంబరం చెప్పారు.
ఎఫ్ఐపీబీలో ఐదుగురు సెక్రటరీలు ఉంటారని, వారు ఈ కేసులను పరిశీలించిన తర్వాతనే ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనేది ప్రతిపాదిస్తారని చిదంబరం నేటి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసును పరిశీలించే ప్రతిఒక్కరి దగ్గర్నుంచి సీబీఐ రిపోర్టు తీసుకుందని, సాధారణ వ్యాపారం మాదిరిగా ఆమోదం ఇవ్వడానికి ఆర్థికమంత్రికి సమర్థాధికారం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఇందులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్టు కోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన కోర్టు దర్యాప్తు స్థితిగతులపై నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఒప్పందానికి ఎఫ్‌ఐపీబీ అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. గరిష్టంగా రూ. 600 కోట్ల విలువైన ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని స్వామి పేర్కొన్నారు.
Advertisement