
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ తాజాగా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘ఇంటెక్స్’ భాగస్వామ్యంతో చౌక ధరలో ‘ఆక్వా లయన్స్ ఎన్1’ అనే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.1,649. అయితే ఇక్కడ కొన్ని షరతులున్నాయి. వినియోగదారులు రూ.3,149 డౌన్‌పేమెంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలి. తర్వాత 36 నెలలపాటు రూ.169తో రీచార్జ్ చేసుకోవాలి. కస్టమర్ 18 నెలల తర్వాత రూ.500, 36 నెలల తర్వాత రూ.1,000 క్యాష్ రిఫండ్ పొందొచ్చు. వినియోగదారుడు రూ.169 ప్లాన్ వద్దనుకుంటే ఇతర టారిఫ్‌లను ఎంచుకోవచ్చు. అయితే తొలి 18 నెలల కాలంలో రూ.3,000 మొత్తానికి సమానమైన రీచార్జ్‌లను చేసుకోవాలి.
అప్పుడు రూ.500 రిఫండ్ పొందొచ్చు. తర్వాతి 18 నెలల్లో మరో రూ.3,000 విలువైన రీచార్జ్ చేసుకోవాలి. అప్పుడు రూ.1,000 రిఫండ్ వస్తుంది. ఇక ఆక్వా లయన్స్ ఎన్1 స్మార్ట్‌ఫోన్‌లో 4 అంగుళాల స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. కాగా భారతీ ఎయిర్‌టెల్, ఇంటెక్స్ సంస్థలు సంయుక్తంగా ‘ఆక్వా ఏ4’, ‘ఆక్వా ఎస్’ అనే మరో రెండు స్మార్ట్‌ఫోన్లను కూడా ఆవిష్కరించాయి. వీటి ధర వరుసగా రూ.1,999గా, రూ.4,379గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment