ఒమాహా (అమెరికా): ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ వారసుడిగా బెర్క్‌షైర్ హాథ్‌వే పగ్గాలు ఒక భారతీయుడికి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయా.. అంటే ఉన్నాయనేలా స్వయంగా బఫెటే సంకేతాలిచ్చారు. బెర్క్‌షైర్ హాథ్‌వే వార్షిక సర్వ సభ్య సమావేశం సందర్భంగా సూచనప్రాయంగా రెండు పేర్లు చెప్పడం ద్వారా ఊహాగానాలకు కాస్త తెరదించే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరిలో ఒకరు భారతీయుడైన అజిత్ జైన్ కావడం గమనార్హం. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న బఫెట్.. ఏటా నిర్వహించే షేర్‌హోల్డర్ల సమావేశం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, బిలియనీర్లు ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందులో పాల్గొనే అవకాశం దక్కించుకునేందుకు పోటీపడతారు. ఈసారి 20,000 మందికి అవకాశం దొరికింది.
శనివారం జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న షేర్‌హోల్డర్ల నుంచి ఈసారి కూడా బఫెట్ వారసుడిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి నేరుగా సమాధానమివ్వని బఫెట్ సూచనప్రాయంగా రెండు పేర్లు ప్రస్తావించారు. గతేడాది డైరెక్టర్ల బోర్డులోకి ప్రమోట్ అయిన అజిత్ జైన్ (67), గ్రెగరీ ఏబుల్ (57)లను ప్రస్తావిస్తూ.. భవిష్యత్‌లో షేర్‌హోల్డర్ల ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు..తన దీర్ఘకాల వ్యాపార భాగస్వామి చార్లీ ముంగర్ (95)తో పాటు వీరిద్దరు కూడా స్టేజ్‌పై ఉంటారని పేర్కొన్నారు. ‘గ్రెగ్, అజిత్‌లు అద్భుతమైన మేనేజర్లు, వారిద్దరూ చాలా గొప్ప విజయాలు సాధించారు‘ అని బఫెట్ తెలిపారు. అయితే, ఈ ఇద్దరిలో ఎవరికి పగ్గాలు ఇవ్వబోతున్నారన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. ‘బెర్క్‌షైర్‌లో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. మిగతా కంపెనీలతో పోలిస్తే ఈ విధానం బాగానే పనిచేసింది. కాబట్టి మీరు మమ్మల్ని భరించాల్సి ఉంటుంది. తప్పదు‘ అని బఫెట్ వ్యాఖ్యానించారు.
అజిత్ జైన్ ఎవరంటే..
ఒడిశాలో పుట్టి, పెరిగిన అజిత్ జైన్ 1986లో బెర్క్‌షైర్ హాథ్‌వే ఇన్సూరెన్స్ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆ విభాగానికి వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డాయిష్ బ్యాంక్ మాజీ కో–సీఈవో అన్షు జైన్‌కు అజిత్ వరుసకు సోదరుడవుతారు. మరోవైపు, 1992లో ఎనర్జీ విభాగంలో చేరిన ఏబెల్ గత ఏడాది కాలం పైగా బీమాయేతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. బఫెట్ నిష్క్రమించిన పక్షంలో బెర్క్‌షైర్ హాథ్‌వే చరిత్రలో ఒక శకం ముగుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సారథ్యం వహిస్తున్నందుకే బెర్క్‌షైర్ షేర్లు వాస్తవ విలువ కన్నా 10–15 శాతం ప్రీమియం రేటు పలుకుతున్నాయని, ఆయన గానీ తప్పుకుంటే బెర్క్‌షైర్ హాథ్‌వే బహుళ సంస్థలుగా విడిపోవచ్చని వారి అంచనా. తొలి త్రైమాసికంలో బెర్క్‌షైర్ హాథ్‌వే 21.66 బిలియన్ డాలర్ల నికర లాభం ప్రకటించింది.
గూగుల్‌ను వదులుకోవడం సిగ్గుచేటు..
టెక్ దిగ్గజం అమెజాన్‌లో వాటాలు ఉన్నాయంటూ బెర్క్‌షైర్ వెల్లడించిన నేపథ్యంలో .. కంపెనీ పెట్టుబడి వ్యూహాలపైనా బఫెట్‌కు ఇన్వెస్టర్ల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒక ఆన్ లైన్ పుస్తకాల విక్రయ సంస్థ నుంచి ఈ–కామర్స్ దిగ్గజంగా అమెజాన్ ను తీర్చిదిద్దడంలో ఆ సంస్థ చీఫ్ జెఫ్ బెజోస్ అత్యద్భుతాన్ని ఆవిష్కరించారని బఫెట్ పేర్కొన్నారు. అర్థం కాని టెక్నాలజీ స్టాక్స్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో గూగుల్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడంపై తనకు, బఫెట్‌కు సిగ్గుచేటుగా అనిపించిందని ముంగర్ చెప్పారు. ‘మేం నోట్లో వేలెట్టుకుని కూర్చున్నాం. పెద్ద తప్పు చేశాం‘ అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే అమెజాన్ లోను, యాపిల్‌లో 40 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినప్పటికీ టెక్నాలజీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని మార్చుకున్నట్లు కాదని బఫెట్ పేర్కొన్నారు. మరోవైపు, తరచూ ప్రమాదాల బారిన పడుతున్న బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ప్రశ్నలకు స్పందిస్తూ.. సదరు విమానం సురక్షితమైనదేనని, అందులో ప్రయాణించడానికి తాను ఒక్క క్షణం కూడా సందేహించబోనని బఫెట్ స్పష్టం చేశారు. అటు మహిళా ఆర్థికవేత్తలు నిర్వహించిన సమావేశానికి హాజరై అందర్నీ ఆశ్చర్యపర్చారు బఫెట్. ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment