సాక్షి, న్యూఢిల్లీ : ఆలిండియా రేడియో జాతీయ చానల్‌కు కాస్ట్ కటింగ్ సెగ తాకింది. ఆకాశవాణి జాతీయ ఛానల్ ప్రసారాలు హేతుబద్దీకరణ, నిర్వహణ వ్యయం తగ్గింపులో భాగంగా ఆల్ ఇండియా రేడియో (ఎఐఆర్) జాతీయ ఛానల్‌ను మూసివేయాలని ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ప్రసార భారతి నిర్ణయించింది. ఈ మేరకు ప్రసారభారతి తన నిర్ణయాన్నిడిసెంబరు 24న ఎఐఆర్ డైరెక్టరేట్‌కు తెలిపింది. ఇందుకోసం గత ఏడాది పలుమార్లు సంప్రదింపులు, చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని వెంటనే అమలు చేయాలని ఆలిండియా రేడియోను ఆదేశించింది. అలాగే అకాడమీస్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియాను కూడా మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఐదు నగరాలు, అహ్మదాబాద్ హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా అకాడెమీలను రద్దు చేయనుంది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. తోడాపూర్, నాగపూర్ సహా ఇతర నగరాల్లోని సిబ్బందిని వేరే ప్రదేశాలకు సర్దుబాటు చేయనుంది. జాతీయ చానెల్ ద్వారా భద్రపరిచే కార్యక్రమాల ఆర్కైవ్స్‌ను, డిజిటలైజేషన్‌కోసం ఢిల్లీలోని సెంట్రల్ ఆర్కైవ్స్ సెంటర్‌కు పంపించాలని జనవరి 3, 2019 తేదీన ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది.
జాతీయ ఛానల్‌కు సంబంధించిన ట్రాన్స్‌మీటర్లు బలహీనంగా ఉండటం కూడా మూసివేతకు కారణమని ఏఐఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నాగపూర్‌లో ఉన్న ఒకే ఒక ట్రాన్స్‌మీటరు మాత్రమే ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ప్రస్తుత డిజిటల్ రేడియో యుగంలో ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. అలాగే పటిష్టమైన శ్రోతల ప్రాతిపదిక లేని ఛానల్‌లో పెట్టుబడులు పెట్టడం సరైంది కాదని సీనియర్ నిర్వాహకులు భావించారని ఆయన వివరించారు. అంతేకాదు ప్రస్తుతం కొన్ని ఏఐఆర్ కార్యక్రమాలను అవుట్‌సోర్స్ ద్వారా నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఏఐఆర్ వెబ్‌సైట్‌ను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఐఆర్‌లోని కొన్ని విభాగాలు ఈ నిర్ణయంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ ఛానల్ ప్రసారాలు చాలా ముఖ్యమైన భాగమని, మొత్తంగా దాన్ని మూసివేయడం కంటే ఖర్చులను తగ్గించుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని కోరుతున్నాయి
కాగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు జాతీయ ప్రసారాలు ప్రసారమయ్యే నేషనల్ చానల్ 1987లో ప్రారంభమైంది. 31 సంవత్సరాలకుపైగా జాతీయ వార్తలను, కీలక అంశాలను ప్రజలకు చేరవేయడంలో చురుకైన కీలక పాత్ర పోషించింది.
Comments
Please login to add a commentAdd a comment