న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల కళ్లన్నీ ఇప్పుడు బడ్జెట్ కోసం వేచి చూస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ గురువారం(ఫిబ్రవరి 1)న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్. బడ్జెట్ ప్రతిపాదనలతోపాటు, ఈ వారం వెలువడే బ్లూచిప్ కంపెనీల క్యూ3 ఫలితాలు, తయారీ రంగ గణాంకాలు స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ తదితర అంశాలు కూడా ఈ వారం మార్కెట్‌పై తగిన ప్రభావం చూపనున్నాయి. బడ్జెట్ రోజే తయారీ రంగానికి సంబంధించి పీఎమ్‌ఐ గణాంకాలు వెల్లడి కానుండటం కీలకం. ‘‘ప్రస్తుతం స్టాక్ విలువలు అధిక స్థాయిల్లో ఉండటంతోపాటు, త్వరలో జరిగే పరిణామాలు దూకుడుతో కూడిన కొనుగోళ్లకు బ్రేక్ వేయొచ్చు.
కీలకమైన బడ్జెట్, ఆర్థిక గణాంకాల నేపథ్యంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండొచ్చు’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ అన్నారు. ‘‘జీఎస్టీ తర్వాత ఇది మొదటి బడ్జెట్. అలాగే, ప్రస్తుత ప్రభుత్వానికి చివరి పూర్తి సంవత్సరపు బడ్జెట్ కావడంతో అంచనాలు అధికంగా ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణతోపాటు మౌలిక, గ్రామీణ ప్రాంతాలపై ప్రభుత్వ వ్యయాలు కొనసాగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ప్రైవేటు క్లయింట్‌గ్రూపు హెడ్ వీకే శర్మ తెలిపారు.
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..
నేటి(సోమవారం) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే రోజే ప్రభుత్వం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. ఫిబ్రవరి 1(గురువారం) మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ జనవరి నెలకు సంబంధించిన భారత సేవల రంగం పనితీరును ప్రతిబింబించే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్‌ఐ) గణాంకాలను వెల్లడిస్తుంది. గత ఏడాది నవంబర్లో 52.6గా ఉన్న పీఎమ్‌ఐ సూచీ గత నెలలో 54.7కు పెరిగాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, చైనా, యూరోజోన్, అమెరికా జనవరి నెల తయారీ రంగ పీఎమ్‌ఐ గణాంకాలు ఈ గురువారం (ఫిబ్రవరి 1న) వస్తాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశాలు ఈ నెల 30న ఆరంభమవుతాయి.
నేడు హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు: ఇక కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాల విషయానికొస్తే, నేడు(సోమవారం) హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, టెక్ మహీంద్రాలు క్యూ3 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం(ఈ నెల 30) ఐఓసీ, ఈ నెల 31న(బుధవారం) ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్ టీ, ఎన్‌టీపీసీ, వేదాంత కంపెనీలు, శుక్రవారం (ఫిబ్రవరి 2న) బజాజ్ ఆటో, హిందాల్కో కంపెనీల క్యూ3 ఫలితాలు వస్తాయి.
నేటి నుంచి గెలాక్సీ ఐపీఓ
గెలాక్సీ సర్ఫాక్టంట్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి నుంచి ప్రారంభమవుతోంది. రూ. 1.470–1,480 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా రూ. 937 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కనీసం 10 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31న ముగిసే ఈ ఐపీఓలో భాగంగా మొత్తం 63.31 లక్షల షేర్లను జారీ చేయనున్నారు. వచ్చే నెల 8న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.
రెండు లిస్టింగ్‌లు..
ఈ వారంలో రెండు కొత్త కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. నేడు(సోమవారం) న్యూజెన్ సాఫ్ట్‌వేర్ షేర్లు లిస్టవుతాయి. ఈ నెల 16–18 మధ్య రూ.240–245 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 8 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఇక అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఈ నెల 30న(మంగళవారం) స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. ఈ నెల 17–19 మధ్య రూ.855–859 ప్రైస్‌బాండ్‌తో వచ్చి న ఈ ఐపీఓ 165 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది.
ఈ వారం ఈవెంట్స్
జనవరి 29 పార్లమెంట్ బడ్జెట్ సమాశాలు ఆరంభం, ఆర్థిక సర్వే, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా క్యూ3 ఫలితాలు
జనవరి 30 ఐఓసీ ఫలితాలు
జనవరి 31 ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, వేదాంత ఫలితాలు
ఫిబ్రవరి 1 బడ్జెట్, తయారీ రంగ పీఎమ్‌ఐ గణాంకాలు
ఫిబ్రవరి 2 బజాజ్ ఆటో, హిందాల్కో క్యూ3 ఫలితాలు
Comments
Please login to add a commentAdd a comment