షాపింగ్‌కు వెళ్లడం ఒక ఎత్తయితే, బిల్లింగ్ కౌంటర్ల వద్ద వేచిచూడటం మరో ఎత్తు. ఈ ఎదురుచూపులు అవసరం లేకుండా.. అసలు బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన పనే లేకుండా సరికొత్త టెక్నాలజీని ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ ప్రధాన కార్యాయం సీటెల్‌లో తొలిసారిగా అత్యంత అధునాతన టెక్నాలజీతో ఓ కొత్త రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. అదే అమెజాన్ గో స్టోర్. దీని ప్రాముఖ్యత ఏమిటో ఓ సారి తెలుసుకుందాం.
అమెజాన్ గో... షాపింగ్ ఎంతో సులువు..
అమెజాన్ గో స్టోర్‌లోకి షాపింగ్‌కి వెళ్లే ముందే మీ స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ గో అనే యాప్ ఓపెన్ చేయాలి. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని మాల్ ప్రవేశద్వారం వద్దే స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేరుగా అక్కడున్న స్మార్ట్ కప్ బోర్డుల వద్దకు వెళ్లి, వాటిలో మనకు కావాల్సిన వస్తువులను తీసుకోవాలి. మనం తీసుకునే సమయంలోనే అవి నేరుగా మన కార్ట్‌లోకి యాడ్ అయిపోతాయి. ఒకవేళ మనం తీసుకున్న వస్తువు వద్దనుకుంటే వెంటనే అక్కడ పెట్టేయొచ్చు. అదే సమయంలో ఆ వస్తువు కార్ట్ నుంచి తొలగిపోతుంది. ఏమైతే మనం తీసుకుని బ్యాగులో వేసుకుంటామో అవి మాత్రమే మన కార్ట్‌కు యాడ్ అవుతాయి. మాల్ వదిలివెళ్లే సమయానికి కూడా కార్ట్‌లో అవే ఉంటాయి. వాటికి ఎంత మొత్తం అయిందో మన స్మార్ట్‌ఫోన్‌లోనే చూసుకోవచ్చు. చెల్లింపు కూడా ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోనే అయిపోతుంది. దీంతో బిల్లింగ్ కౌంటర్‌కు వెళ్లి గంటల పాటు వేచిచూడాల్సివసరం ఉండదు. నేరుగా బయటికి వచ్చేయొచ్చు. దీంతో కస్టమర్లకు షాపింగ్ ఎంతో సులభతరంగా మారుతుంది.
2016 లో ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ 2017 ఆరంభం నుంచే అందుబాటులోకి వచ్చింది. కానీ ఇందులో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతున్నట్లుగా విమర్శలు రావటంతో కంపెనీ వివరణ ఇచ్చింది. సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆశించిన దాని కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు. కస్టమర్లకు ఏం కావాలో తెలుసుకునేందుకు వారి నుంచి సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సోమవారం నుంచి తమ తొలి సీటెల్ ఆటోమేటెడ్ స్టోర్ ప్రారంభమైందని చెప్పారు. ఈ స్టోర్‌లో కిరాణా సామాన్లు, శీతల పానీయాలు, భోజన తయారీ కిట్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్టోర్లను తెరిచే యోచనలో ఉన్నట్లు కూడా తెలిపారు.
అమెజాన్‌కు రీటైల్ స్టోర్లు నిర్వహించడం కొత్తేమీ కాదు. అమెరికా వ్యాప్తంగా13 బుక్‌స్టోర్లను నిర్వహిస్తోంది. మరో మూడు ప్రాంతాల్లో కూడా ఈ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. 'హోల్ ఫుడ్స్ గ్రోసరీ చైన్'ను ఇప్పటికే దాదాపు 13.7 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ కామర్స్‌లో అమెజాన్ డాట్ కామ్‌కు గట్టి పోటీని ఇస్తున్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' కూడా త్వరలో కిరాణరంగంలోకి అడుగుపెట్టనుంది. ఈ రంగంలో కూడా ఇరు కంపెనీలకు గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment