టాప్‌లో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ గత వారం నిర్వహించిన ప్రైమ్ డే విక్రయాల్లో ఫైర్ టీవీ స్టిక్ ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో నిలిచింది. భారత్‌లో టాప్–3 ఉత్పాదనల్లో స్థానం సంపాదించినట్టు కంపెనీ వెల్లడించింది. ప్రైమ్ కస్టమర్ల కోసం దేశంలో తొలిసారిగా ప్రైమ్ డే అమ్మకాలను జూలై 10, 11న నిర్వహించారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రైమ్ డే సందర్భంగా సేల్స్ మూడు రెట్లను దాటాయి. స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్లలో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ప్రపంచంలో లీడర్‌గా నిలుస్తున్నట్లు కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ అభిషేక్ కౌశిక్ తెలిపారు. పీఆర్ మేనేజర్ రాఘవేంద్ర రమేశ్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
రూ.3,999 ధరలో మరే ఇతర కంపెనీ పోటీపడటం లేదని చెప్పారు. ‘3,000 పైగా యాప్స్ నిక్షిప్తమై ఉన్నాయి. వైఫైతో పనిచేసే ఈ స్టిక్‌ను టీవీకి అనుసంధానిస్తే చాలు. యాప్స్, సినిమాలు, క్రీడలు, టీవీ షోల వంటి కంటెంట్ ప్రత్యక్షమవుతుంది. యాప్ సహాయంతో లైవ్ టీవీ చూడొచ్చు. ఎక్స్‌క్లూజివ్ సినిమాలు, టీవీ షోలూ ఉన్నాయి. భారత్ కోసం భారత్‌లో నిర్మించిన ప్రత్యేక షోలు అందుబాటులోకి తీసుకొచ్చాం. రిమోట్‌ను దగ్గరగా పెట్టుకుని వాయిస్ కమాండ్ ఇచ్చినా చాలు. డేటా తక్కువ వినియోగం అయ్యేందుకు వీలుగా సాంకేతికంగా ఏర్పాట్లు ఉన్నాయి’ అని వివరించారు.