
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా రూ. 4,400 కోట్లను ఇక్కడి మార్కెట్లో పెట్టుబడిగా పెట్టనుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించిన తాజా సమాచారం మేరకు.. అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్ డాట్ కామ్ ఇంక్ సంస్థలు ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నాయి. రైట్స్ ఇష్యూ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. ఏ విభాగంలో ఎంత పెట్టుబడి చేరుకోనుందనే విషయానికి వస్తే.. అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ (మార్కెట్ ప్లేస్ యూనిట్) రూ. 3,400 కోట్లు, అమెజాన్ పే ఇండియా రూ. 900 కోట్లు, అమెజాన్ రిటైల్ ఇండియా (ఫుడ్ రిటైల్ వ్యాపారం) రూ. 172.5 కోట్లను అందుకోనున్నాయి.
వివిధ విభాగాల్లో 2018–19 కాలంలో రూ. 7,000 కోట్ల పెట్టుబడి పెట్టిన అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలతో పెరిగిన పోటీ కారణంగా భారత్‌లో తన పెట్టుబడిని మరింత పెంచనున్నట్లు ఈ రంగ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెట్టుబడికి సంబంధించి ఇక్కడి వ్యాపార విభాగాల నుంచి అధికారిక ప్రకటన ఏమీ లేకపోయినప్పటికీ.. 2016లో సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారత్‌లో పెట్టుబడులను 5 బిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటన చేసిన ఆధారంగానే ఈ నూతన పెట్టుబడులు చేరనున్నాయని విశ్లేషిస్తున్నాయి.