అంబానీ ఇంట పెళ్లి సందడి...! | Ambani Scion Akash To Marry Diamantaire Russel Mehtas Daughter Shloka? | Sakshi
Sakshi News home page

అంబానీ ఇంట పెళ్లి సందడి...!

Published Mon, Mar 5 2018 8:29 AM | Last Updated on Mon, Mar 5 2018 12:21 PM

Ambani Scion Akash To Marry Diamantaire Russel Mehtas Daughter Shloka? - Sakshi

న్యూఢిల్లీ : అంబానీల ఇంట్లో పెళ్లి బాజా మోగనుందా? అపర కుబేరుడు, దేశీ కార్పొరేట్‌ రంగ రారాజు ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారా? విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఇంతకీ ఈ కార్పొరేట్‌ యువరాజును మనువాడబోయే వధువు ఏవరంటారా...! డైమండ్‌ కింగ్‌గా పేరుగాంచిన రసెల్‌ మెహతా కుమార్తె శ్లోకా మెహతా అంటూ మీడియాలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నిశ్చితార్థంపై కొద్ది వారాల్లో ప్రకటన వెలువడనుందని.. ఈ ఏడాది డిసెంబర్‌ ఆరంభంలో వివాహం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయా వర్గాల సమాచారం. అయితే, ఈ పెళ్లి విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇరు కుటుంబాలు నిరాకరించడం గమనార్హం. నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించి ఇంకా తేదీలేవీ ఖరారు కాలేదని ముకేశ్‌ అంబానీ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు తెలిపారు. 'ఆకాశ్‌ అంబానీ పెళ్లికి సంబంధించిన శుభవార్తను తగిన సమయంలో ముకేశ్‌ కుటుంబమే స్వయంగా అందరితో పంచుకుంటుంది. పెళ్లి ఖరారైతే కచ్చితంగా అది భారత్‌లోనే జరుగుతుంది' అని ఆయా వర్గాలు వివరించారు. ఈ నెల 24న నిశ్చితార్థం ఉండొచ్చన్న వార్తలను తోసిపుచ్చారు. 

ఎవరీ శ్లోకా మెహతా? 
'రోజీ బ్లూ డైమండ్స్‌' అధినేత రసెల్‌ మెహతా కుటుంబంతో ముకేశ్‌ అంబానీ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. శ్లోకా మెహతా, ఆకాశ్‌ అంబానీ కూడా ఒకరికొకరు ఇదివరకే తెలుసనేది సంబంధిత వార్గాల సమాచారం. ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో వీరిద్దరూ కలిసి చదువుకోవడం విశేషం. 2009లో హైస్కూలు విద్యను పూర్తి చేసుకున్న శ్లోకా మెహతా... ఆ తర్వాత ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ఆంత్రపాలజీ డిగ్రీ చదివారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. రోజీ బ్లూ ఫౌండేషన్‌లో 2014 జూలై నుంచి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా, స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన వాలంటీర్లను అందించే 'కనెక్ట్‌ఫర్' అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు కూడా ఆమె. రసెల్, మోనా మెహతాల ముగ్గురు సంతానంలో చివరి కుమార్తె శ్లోకా.

ఇక ముకేశ్, నీతా అంబానీలకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు ఆకాశ్‌, కుమార్తె ఈషా అంబానీలు కవలలు.  చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికం వెంచర్‌ రిలయన్స్‌ జియో కంపెనీ బోర్డులో ఇప్పటికే ఆకాశ్‌ అంబానీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) మెగా కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీకి మోనా మెహతాతో బంధుత్వం ఉండటం కొసమెరుపు. 

అప్పట్లోనే ఇష్టపడ్డారా..?
ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకొనే సమయంలోనే ఆకాశ్‌, శ్లోకా ఒకరినొకరు ఇష్టపడేవారని, 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి కాగానే ఆకాశ్‌ ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచారని తెలుస్తోంది. శ్లోక కూడా అతని ప్రేమను అప్పుడే అంగీకరించడం, తాజాగా కుటుంబ సభ్యులు ఒకే చెప్పేయడంతో వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ప్రచారం సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement