అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..! | American FOMC Conference On 10/12/2019 | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

Published Mon, Dec 9 2019 12:28 AM | Last Updated on Mon, Dec 9 2019 5:09 AM

American FOMC Conference On 10/12/2019 - Sakshi

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితంకావడం, ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో గతవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఒక శాతం నష్టాలను నమోదుచేసింది. నిఫ్టీ 12,000 పాయింట్ల సైకలాజికల్‌ మార్కును కోల్పోయింది. ఇక ఈ వారంలో మార్కెట్‌ ట్రెండ్‌ ఏ విధంగా ఉండనుందనే అంశానికి వస్తే.. ఒడిదుడుకులకే ఆస్కారం ఉందని, మరింత కరెక్షన్‌కు ఆస్కారం ఉందని అధిక శాతం విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

బలహీనమైన వృద్ధి, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ప్రస్తుత ప్రీమియం వాల్యుయేషన్‌ నిలబెట్టుకునే అవకాశం లేదని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా సులభమైన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తే మాత్రం మన మార్కెట్లలో పతనానికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ 11,750–12,100 స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు.

ట్రేడ్‌ డీల్‌పై ఆశలు
నవంబర్‌లో అమెరికాలోని నిరుద్యోగుల రేటు 3.5 శాతానికి తగ్గడం, వాణిజ్య ఒప్పందంపై పెరిగిన ఆశావాదం కారణంగా శుక్రవారం అక్కడి స్టాక్‌ సూచీలు ఒక శాతం లాభాలను నమోదుచేశాయి. అమెరికా అనేక విడతల్లో చైనా వస్తువులపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే కాగా, ఈ నెల 15 నుంచి 156 బిలియన్‌ డాలర్ల కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈ గడువుతేదీ కంటే ముందుగానే అమెరికా–చైనాల మధ్య తొలి విడత వాణిజ్య ఒప్పందాలు పూర్తయ్యే సూచనలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే మన మార్కెట్‌ కూడా సానుకూలంగా స్పందించనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఫెడ్‌ సమావేశంపై దృష్టి 
వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. ఈ ఏడాదిలో చివరిసారిగా జరిగే ఈ సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు భారత మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు.

ఇక గురువారం యూకేలో జరిగే సాధారణ ఎన్నికలు బ్రెగ్జిట్‌కు ఒక దిశను ఇవ్వనున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు పెరిగిన ముడిచమురు ధరలు ఈవారం మార్కెట్‌ గమనానికి మరో కీలక అంశంగా మారాయి.

ఆర్థికాంశాల ప్రభావం
అక్టోబర్‌ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ), నవంబర్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం  (సీపీఐ)  డేటా గురువారం వెల్లడికానున్నాయి. శుక్రవారం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం డేటా విడుదలకానుంది.

ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు..
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈనెల్లో ఇప్పటివరకు రూ. 244 కోట్లను భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల సమాచారం మేరకు.. గడిచిన వారంలో వీరు రూ. 1,669 కోట్లను ఈక్విటీ మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకున్నారు. అయితే, డెట్‌ మార్కెట్‌లో రూ.1,424 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా వీరి నికర ఉపసంహరణ రూ. 244 కోట్లుగా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement