వంటనూనెల దిగుమతి సుంకం 5 శాతం పెంపు
న్యూఢిల్లీ : రైతు ప్రయోజనాలను పరిరక్షించడానికి, దేశీ ఆయిల్ రిఫైనరీ కంపెనీలను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వంటనూనెల దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్ నోటిఫికేషన్ ప్రకారం.. ముడి వంటనూనెల దిగుమతి సుంకం 7.5 శాతం నుంచి 12.5 శాతానికి, రిఫైన్డ్ వంటనూనెల దిగుమతి సుంకం 15 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. వంటనూనెల దిగుమతి సుంకాన్ని స్వల్పంగా పెంచడం వల్ల దేశంలోకి తక్కువ ధరలకు అధిక మొత్తంలో జరుగుతున్న వంటనూనెల దిగుమతులను అడ్డుకోలేమని, అలాగే రైతులకు, దేశీ ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు కూడా ఎలాంటి ప్రయోజనం కలగదని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టార్స్ అసోసియేషన్ (ఎస్‌ఈఏ) పేర్కొంది.
ప్రభుత్వ చర్య ఆహ్వానించదగ్గదేనని, కానీ ముడి వంటనూనెల దిగుమతి సుంకాన్ని 25 శాతానికి, రిఫైన్డ్ వంటనూనెల దిగుమతి సుంకాన్ని 45 శాతానికి పెంచితేనే పెంపు ప్రయోజనాలు రైతులకు, దేశీ ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు అందుతాయని ఎస్‌ఈఏ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.వి.మెహతా అభిప్రాయపడ్డారు. 2013-14 ఆయిల్ సంవత్సరం (నవంబర్-అక్టోబర్)లో 11.6 మిలియన్ టన్నులుగా ఉన్న మొత్తం వంటనూనెల దిగుమతులు 2014-15 ఆయిల్ సంవత్సరానికి వచ్చేసరికి 14 మిలియన్ టన్నులకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. మన దేశంలోకి వంటనూనెలు అధికంగా మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.