న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 2017వ సంవత్సరం ఇళ్ల విక్రయాల పరంగా కలసిరాలేదు. అమ్మకాలు ఏకంగా 40 శాతం తగ్గి 2,02,800 యూనిట్లకు పరిమితమైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రో, పుణె, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో విక్రయాల గణాంకాలను విశ్లేషించింది. ‘‘నివాస గృహాల మార్కెట్ ధోరణలను పరిశీలిస్తే 2013, 2014 సంవత్సరాలు బావున్నాయి. ఆ తర్వాత ఇళ్ల విక్రయాలు క్షీణ బాట పట్టగా, ఇప్పటి వరకు ఇవి తిరిగి గాడిన పడినట్టు స్పష్టమైన సంకేతాలు ఏవీ కనిపించడం లేదు’’ అని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. 2013, 2014 సంవత్సరాల్లో వార్షికంగా సగటున 3.3 లక్షల నివాస గృహ యూనిట్లు అమ్ముడుపోయాయి. 2015–16 సంవత్సారాల్లో విక్రయాలు సగటున 2.7 లక్షల యూనిట్లకు తగ్గాయి. 2013, 2014 సంవత్సరాలతో పోలిస్తే 17 శాతం తగ్గుదల ఉందని అనరాక్ తెలిపింది. ఇక 2017లో ఇవి మరింత క్షీణించి 2,02,800 విక్రయాలకే పరిమితమైనట్టు పేర్కొంది. 2013–14 సంవత్సరాల్లో నమోదైన నివాస గృహ విక్రయాలతో పోలిస్తే 2017 సంవత్సరంలో 40 శాతం తగ్గాయని వివరించింది.
పట్టణాల వారీగా...
►అధిక విక్రయాలు జరిగే ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రో ప్రాంతంలో 2013–14తో పోలిస్తే 2017లో అమ్మకాలు వరుసగా 68 శాతం, 27 శాతం చొప్పున తగ్గాయి. 2017లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 37,600 యూనిట్లు అమ్మడయ్యాయి. 2013–2014లో అమ్మకాలు 1,16,250 యూనిట్లుగా ఉండటం గమనార్హం.
► బెంగళూరులో 17%, చెన్నైలో 45% తగ్గాయి.
► పుణెలోనూ ఇళ్ల అమ్మకాలు 29% క్షీణించాయి. కోల్‌కతాలో అమ్మకాలు 12% తగ్గాయి.
►ఇక హైదరాబాద్ మార్కెట్లో పరిస్థితి వీటికి భిన్నంగా ఉంది. ఇక్కడ 2013–14 నాటితో పోలిస్తే 2017లో నివాస గృహాల అమ్మకాల్లో 32% వృద్ధి ఉందని అనరాక్ వెల్లడించింది.
ఇళ్ల విక్రయాలు 40 శాతం డౌన్
Published Mon, Mar 19 2018 5:10 AM | Last Updated on Mon, Mar 19 2018 5:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment