న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో చైనా పెట్టుబడులు భారత్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమవుతారన్న వార్తల నేపథ్యంలో మహీంద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఒకవేళ వివాదాస్పద అంశాలు పరిష్కారమైనప్పటికీ .. అమెరికాకు భారీగా ఎగుమతులు చేసే చైనా సంస్థలు .. కొంత హెడ్జింగ్ కోసం భారత్‌లోనూ అనుబంధ సంస్థలపై పెట్టుబడులు పెట్టడం, తయారీ పరిజ్ఞానాన్ని బదలాయించడం వివేకవంతమైన నిర్ణయం అవుతుంది. ఈ రకంగా భారత్‌లోకి చైనా పెట్టుబడులు వెల్లువెత్తడం ఖాయం‘ అని మైక్రో బ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. చాలా భారతీయ కంపెనీలు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. చైనా పెట్టుబడులతో భారత్‌కు ప్రస్తుతం అవసరమైన ఉద్యోగాల కల్పన జరిగేందుకు అవకాశం ఉందని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment