మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్ర | Anand Mahindra Team Tracked Down Viral Shoe Doctor | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్ర

Published Sat, Apr 28 2018 7:51 PM | Last Updated on Sat, Apr 28 2018 7:51 PM

Anand Mahindra Team Tracked Down Viral Shoe Doctor - Sakshi

గతంలో ఆనంద్‌ మహీంద‍్ర ట్వీట్‌ చేసిన ఫొటో

ముంబై : సోషల్‌ మీడియాలో తరచుగా యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర మరోసారి వార్తల్లో నిలిచారు. సృజనాత్మకతను ప్రోత్సహించే ఈ బిజినెస్‌ టైకూన్‌.. సుమారు రెండు వారాల క్రితం తన ట్విటర్‌లో ‘చెప్పుల డాక్టర్‌’ ఫొటో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫొటో నర్సిరాం అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తిది. అయితే అతని ఫొటోను పోస్ట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. అతని పూర్తి వివరాలు తెలిస్తే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

నెటిజన్ల సాక్షిగా ఇచ్చిన ఆ మాటను ప్రస్తుతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆనంద్‌ మహీంద్రా.  అన్న మాట ప్రకారమే తన సిబ్బందిని పంపించి చెప్పుల డాక్టర్‌ చిరునామా కనుక్కున్నారు. అందుకు సంబంధించి ఆనంద్‌ మహీంద్ర చేసిన ట్వీట్‌ మళ్లీ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ‘నర్సీజీ గుర్తున్నాడు కదా.. నా టీమ్‌ హర్యానా వెళ్లి అతన్ని కలిసింది. అలాగే అతడికి ఎలా సాయపడగలమో అని అడగ్గా.. ఆ నిరాడంబర వ్యక్తి.. డబ్బులు అడగకుండా.. తన షాప్‌ కోసం ఒక మంచి వర్క్‌స్పేస్‌ ఏర్పాటు చేయమని కోరాడు. అందుకోసం ముంబైలో ఉన్న మా డిజైన్‌ స్టూడియో టీమ్‌ ఒక కియోస్క్‌ (అర వంటిది) ఏర్పాటు చేయనుందని’  ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

ఆయన ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు తమకు తోచిన సలహాలు, సూచనలు చేస్తున్నారు. ‘రోడ్డు మీద అతడి దుకాణం ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్లు వెళ్లగొట్టే ప్రమాదం ఉంది. అందుకే అతని కోసం ఒక మొబైల్‌ కియోస్క్‌ ఏర్పాటు చేయమని’ ఓ నెటిజన్‌ సూచించగా.. ‘అతని కోసం ఒక షాప్‌ కట్టించమని’  మరొకరు ట్వీట్‌ చేశారు.  

కాగా నర్సిరాం అనే వ్యక్తి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి దుకాణం ముందు ఒక ప్రకటన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఈ ప్రకటనలో ​‘దెబ్బతిన్న చెప్పుల ఆస్పత్రి, డా. నర్సిరాం, రోగులకు అందుబాటులో ఉండు సమయం’ వంటి వివరాలు ఉన్నాయి. వాట్సాప్‌లో చక్కెర్లు కొట్టిన ఈ ఫొటో ఆనంద్‌ మహీంద్రను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఫోటోను పోస్ట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. ‘చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మంచి మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నాయి. అవకాశం వస్తే ఇతను ఐఐఎమ్‌లో మార్కెటింగ్‌ పాఠాలు చెప్పేస్థాయిలో ఉండేవాడంటూ’  ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement