లండన్: దేశంలోనే సంపన్నుడు, ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో కొనసాగిన రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గత కొద్ది కాలంగా వ్యాపారంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఓ దావాను ఎదుర్కొంటున్న అనిల్, తాజాగా తన ఆస్తులు సున్నాకు పడిపోయాయని లండన్ కోర్టుకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణాన్ని తీసుకున్నారు. తీవ్ర నష్టాలతో ఆర్‌కామ్ దివాలా తీసి, చైనా బ్యాంకులకు రుణాన్ని చెల్లించలేకపోయారు. ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు తమకు రావాల్సిన 4,800 కోట్లు చెల్లించాలని కోర్టుకు వెళ్లాయి.
రుణ ఒప్పందం కింద రూ.4,800 కోట్లు చెల్లించాలని బ్యాంకులు కోర్టులో దావా వేశాయి. వాదనలు విన్న జడ్జి రూ.700 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పారు. అయితే అనిల్ అంబానీ చెల్లించాల్సిన అప్పులను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడాయన ఆస్తులు విలువ పూర్తిగా పడిపోయిందని, అనిల్ తరఫు న్యాయవాది రాబర్ట్ హోవే కోర్టుకు తెలిపారు. తండ్రి చనిపోయాక ముకేశ్ వ్యాపారంలో దూసుకెళ్తుంటే అనిల్ వ్యాపారాలు మాత్రం తీవ్ర నష్టాలను చవిచూశాయి. ముఖేశ్ చమురు, సహజ వాయువులకు సంబంధించిన వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment