Reliance Communication
-
అప్పులు చెల్లించలేను.. వైరాగ్యంలో అనిల్
లండన్: దేశంలోనే సంపన్నుడు, ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో కొనసాగిన రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గత కొద్ది కాలంగా వ్యాపారంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఓ దావాను ఎదుర్కొంటున్న అనిల్, తాజాగా తన ఆస్తులు సున్నాకు పడిపోయాయని లండన్ కోర్టుకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణాన్ని తీసుకున్నారు. తీవ్ర నష్టాలతో ఆర్‌కామ్ దివాలా తీసి, చైనా బ్యాంకులకు రుణాన్ని చెల్లించలేకపోయారు. ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు తమకు రావాల్సిన 4,800 కోట్లు చెల్లించాలని కోర్టుకు వెళ్లాయి. రుణ ఒప్పందం కింద రూ.4,800 కోట్లు చెల్లించాలని బ్యాంకులు కోర్టులో దావా వేశాయి. వాదనలు విన్న జడ్జి రూ.700 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పారు. అయితే అనిల్ అంబానీ చెల్లించాల్సిన అప్పులను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడాయన ఆస్తులు విలువ పూర్తిగా పడిపోయిందని, అనిల్ తరఫు న్యాయవాది రాబర్ట్ హోవే కోర్టుకు తెలిపారు. తండ్రి చనిపోయాక ముకేశ్ వ్యాపారంలో దూసుకెళ్తుంటే అనిల్ వ్యాపారాలు మాత్రం తీవ్ర నష్టాలను చవిచూశాయి. ముఖేశ్ చమురు, సహజ వాయువులకు సంబంధించిన వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ -
అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ
ముంబయి : రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) డైరక్టర్స్ పదవికి అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్ రంగాచార్లు డైరెక్టర్లుగా రాజీనామా చేశారు. అయితే వీరి రాజీనామాలను రుణ సంస్థల కమిటీ తిరస్కరించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. ' సీవోసీ కమిటీ అంబానీతో పాటు మిగతావారి రాజీనామాలను తిరస్కరించింది. రాజీనామా చేసిన వారందరూ ఆర్‌కామ్‌లో యధావిధిగా తమ విధుల్లో కొనసాగవచ్చని తెలిపింది. దివాల ప్రక్రియలో ఉన్న కంపెనీకి పరిష్కారమార్గం చూపించాలని' ఆర్‌కామ్ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ర్టం బకాయిలకు కేటాయింపుల అనంతరం రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) నష్టాలు రూ 30,142 కోట్లకు చేరిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్ జులై-సెప్టెంబర్ కాలానికి రూ 50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, భారతి ఎయిర్టెల్ రూ 23,000 కోట్ల నష్టాలను నమోదు చేసింది. (చదవండి : ఆర్‌కామ్‌కు అనిల్ అంబానీ రాజీనామా) -
ఆర్‌కామ్‌కు అనిల్ అంబానీ రాజీనామా
ముంబై : సంక్షోభం అంచున నిలిచిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా అనిల్ అంబానీ శనివారం వైదొలిగారు. అనిల్ సహా నలుగురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. దివాలా ప్రక్రియ కింద ఆస్తులు అమ్మకానికి ఉంచిన ఆర్ కామ్ నుంచి అనిల్ అంబానీతో పాటు ఛాయా విరాని, రైనా కరానీ, మంజరి కకేర్, సురేష్ రంగాచార్లు డైరెక్టర్లుగా వైదొలిగారు. బీఎస్ఈకి ఇచ్చిన నోటీసులో ఈ మేరకు కంపెనీ పేర్కొంది. కాగా గతంలో కంపెనీ డైరెక్టర్, సీఎఫ్ఓ వీ మణికంఠన్ రాజీనామా చేశారని, వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్ కామ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ర్టం బకాయిలకు కేటాయింపుల అనంతరం కంపెనీ నష్టాలు రూ 30,142 కోట్లకు చేరిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్ జులై-సెప్టెంబర్ కాలానికి రూ 50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, భారతి ఎయిర్టెల్ రూ 23,000 కోట్ల నష్టాలను నమోదు చేసింది. -
మరింత కష్టాల్లోకి అంబానీ : మునగడమా? ఈదడమా?
న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ మరింత కష్టాల్లోకి కూరుకుపోతున్నారు. ఇప్పటికే అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న ఆయనకు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నోటీసులు జారీ చేసింది. రాబోయే స్పెక్ట్రం చెల్లింపు బకాయిల కింద బ్యాంకు హామీలలో భాగంగా 774 కోట్ల రూపాయలు చెల్లించకపోతే లైసెన్సు రద్దు చేస్తామని డీఓటీ హెచ్చరించింది. ఈ నెల చివరి వరకు వీటిని చెల్లించాలని ఆదేశించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు తన ఆస్తులు అమ్మి రుణాలు తీర్చుకోవాలని భావిస్తున్న అనిల్ అంబానీ కంపెనీకి, డీఓటీ ఈ నోటీసులు జారీచేయడం మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం అంబానీ పరిస్థితి సముద్రంలో మునగడమా? ఈదడమా? అనే రీతిలో ఉందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఉన్న రూ.46వేల కోట్ల అప్పులను తీర్చేందుకు తన వైర్లెస్ ఆస్తులను అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోకు విక్రయిస్తోంది. దీంతో రూ.18వేల కోట్ల మేర రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్జిస్తోంది. జూన్ చివరి వారంలోనే ఆర్‌కామ్‌కు డీఓటీ ఈ షోకాజు నోటీసు జారీచేసినట్టు తెలిసింది. ఈ నెల ప్రారంభంలోనే తాము నోటీసులు అందుకున్నామని, దానికి సమాధానం కూడా ఇచ్చినట్టు కంపెనీకి చెందిన అధికారులు చెప్పారు. బ్యాంకు గ్యారెంటీల కింద రూ.774కోట్లను చెల్లిస్తామని తెలిపారు. అయితే టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెట్ ట్రైబ్యునల్(టీడీశాట్) ఆదేశాల ప్రకారం బ్యాంక్ గ్యారెంటీల మొత్తాన్ని డీఓటీ తిరిగి ఇచ్చేయాల్సి ఉందని పేర్కొంది. అయితే తాము బ్యాంక్ గ్యారెంటీలు వెంటనే చెల్లించకపోతే, డీఓటీకి ఎలాంటి నష్టం వాటిల్లదని కూడా ఆర్‌కామ్ తన లేఖలో పేర్కొంది. అయితే ఈ ఫండ్స్‌ను ఆర్‌కామ్ సమకూర్చుతుందో లేదో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ కంపెనీ బ్యాంక్ గ్యారెంటీలను నిర్దేశించిన సమయం లోపల చెల్లించకపోతే, కంపెనీని స్పెక్ట్రమ్ సేల్‌లో అనుమతించేందుకు డీఓటీ సమ్మతించకపోవచ్చని తెలుస్తోంది. దీంతో జియోతో డీల్ జాప్యమవుతుంది. ఒకవేళ అన్నట్టే లైసెన్స్‌లను రద్దు చేస్తే, లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా డీఓటీ హెచ్చరించినట్టు అవుతోంది. -
రుణాలపై ఆర్‌కామ్ కొత్త ప్రణాళిక
ముంబై: భారీగా పేరుకుపోయిన రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్) మరో కొత్త ప్రణాళికను రూపొందించింది. మార్చి నాటికల్లా మొత్తం రుణ సమస్యలకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని కంపెనీ యోచిస్తోంది. బాకీలకు బదులుగా వాటాలిచ్చే ప్రసక్తి లేకుండా రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) ప్రణాళిక నుంచి వైదొలగడం, వ్యూహాత్మక ఇన్వెస్టరుతో జట్టు కట్టడం మొదలైన అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ఈ విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుమారు 1.8 బిలియన్ డాలర్ల బాకీని రాబట్టుకునేందుకు ఆర్కామ్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించిన చైనా సంస్థ కూడా తాజా ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనతో రుణభారం రూ. 25,000 కోట్ల మేర తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం ఆర్‌కామ్ రుణభారం రూ. 44,000 కోట్ల మేర ఉంది. కొత్త రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకటనతో ఆర్‌కామ్ షేర్లు మంగళవారం దూసుకెళ్లాయి. ఏకంగా 32 శాతం మేర లాభపడ్డాయి. సంస్థ మార్కెట్ విలువ ఒకేరోజు రూ.1,389 కోట్లు పెరిగి రూ. 5,899 కోట్లకు చేరింది. -
ఆర్‌కాం భారీ నష్టాలు
ముంబై: అనిల్ అంబానీ ప్రమోటెడ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కాం) క్యూ1 ఫలితాల్లో భారీ నష్టాలను మూటగట్టుకుంది. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో నష్టం రూ .1,210 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 33 శాతం క్షీణించి రూ .3,591 కోట్లకు చేరుకుంది. ఇప్పటికే రుణభారంలో కూరుకున్న ఆర్‌కాం తాజా ఫలితాలంతో మరింత కుదేలైంది. ప్రధానంగా టెలికాం సేవల్లోకి అనిల్ సోదరుడు, బిలియనీర్ ముకేశ్ అంబానీ సంస్థ జియో ఎంట్రీతో ఆర్‌కామ్ భారీగా అప్పుల్లో కూరుకు పోయిన సంగతి తెలిసిందే. -
అప్పుల కుప్ప.. ఆర్‌కామ్
రూ. 42,000 కోట్లకు పైగా రుణభారం ► బ్యాంకులకు వడ్డీ డిఫాల్ట్ ► కంపెనీ ఖాతాను ఎస్ఎంఏ–1 కింద వర్గీకరించిన బ్యాంకులు ► బాండ్ల రేటింగ్ కూడా డౌన్‌గ్రేడ్ ► ఆల్‌టైమ్ కనిష్టానికి షేరు దిగ్గజ టెలికం సంస్థగా వెలుగొందిన రిలయన్స్ కమ్యూనికేషన్ ప్రస్తుతం రుణాల భారంతో కుదేలవుతోందా? వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉందా? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. వడ్డీ బకాయి కారణంగా దేశీయంగా కనీసం 10 బ్యాంకులు ఆర్‌కామ్‌కి ఇచ్చిన రుణాలను ఎస్ఎంఏ–1, ఎస్ఎంఏ–2 కేటగిరీల్లో వర్గీకరించినట్లు తెలుస్తోంది. మరో పక్షం రోజులు దాటితే కొన్ని బ్యాంకులు ఇక వీటిని మొండి బకాయి ఖాతాల (ఎన్పీఏ) కింద కూడా వర్గీకరించాల్సి రావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఆర్‌కామ్‌కి రుణభారంతో పాటు ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ కూడా పెరిగిపోయిన నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీలు కేర్, ఇక్రా ఇప్పటికే కంపెనీ బాండ్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు కూడా వీటికి తోడవడంతో గడిచిన రెండు వారాలుగా క్షీణిస్తున్న ఆర్‌కామ్ షేర్లు సోమవారం ఒక్కరోజే ఏకంగా 24 శాతం పతనమయ్యాయి. బ్యాంకులు ఎస్ఎంఏ కింద వర్గీకరించిన రుణాలకు సంబంధించిన సమాచారం ఇంకా లభ్యం కావడానికి ముందే రేటింగ్ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేశాయి. రిలయన్స్ జియో పోటీ కారణంగా ఆర్కామ్పై ప్రతికూల ప్రభావం పడగలదని పేర్కొన్న కేర్.. తాజాగా డిఫాల్ట్ సంగతి కూడా తెలిస్తే మరింతగా కఠినతరమైన రేటింగ్ ప్రకటించే అవకాశముందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక ఆదాయాల ఆర్జనపై కంపెనీ సామర్ధ్యంపై సందేహాలు, జియో కారణంగా లాభదాయకతపై ప్రతికూల ప్రభావ అంచనాల మూలంగా.. ఆర్‌కామ్ గ్రూప్ రేటింగ్‌ను ఇక్రా బిబిబి నుంచి బిబి స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసింది. మొండిబకాయిల వసూళ్లపై బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తుండటం వల్ల ఎన్పీఏ స్థాయికి అటూ ఇటూగా ఉన్న ఖాతాలపై కూడా మరింతగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్లు ప్రత్యేకంగా ఆర్‌కామ్‌ను ప్రస్తావించకుండా డాల్టన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇండియా డైరెక్టర్ యూఆర్ భట్ అభిప్రాయపడ్డారు. పెరిగిన నష్టాలు.. పోటీతో పాటు పెరుగుతున్న వడ్డీ వ్యయాలు మొదలైనవి ఆర్‌కామ్ ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. జనవరి–మార్చ్ త్రైమాసికంలో ఆర్‌కామ్ ఏకంగా రూ. 966 కోట్ల నష్టం ప్రకటించడంతో వరుసగా రెండో క్వార్టర్లో కూడా నష్టం నమోదు చేసినట్లయింది. మార్చి 31 ఆఖరు నాటికి కంపెనీ రుణభారం రూ. 42,000 కోట్ల పైచిలుకు ఉంది. జియో ఆఫర్ల నేపథ్యంలో గడిచిన 20 ఏళ్లలో టెలికం రంగం ఆదాయాలు తొలిసారిగా తగ్గాయని, దాంతో ఆపరేటింగ్ మార్జిన్లు భారీగా తగ్గగా.. రుణాల కారణంగా వడ్డీ భారం గణనీయంగా పెరిగిపోయిందని శనివారం ఫలితాల ప్రకటన సందర్భంగా ఆర్‌కామ్ పేర్కొంది. కంపెనీ వద్ద నగదు నిల్వలు, నిర్వహణాపరమైన ఆదాయాలు చూస్తుంటే.. స్వల్పకాలిక రుణాల చెల్లింపులు, మూలధన వ్యయాలకు కూడా సరిగ్గా సరిపోకపోవచ్చని లుక్రోర్ అనలిటిక్స్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. నిధులొస్తున్నాయ్..కట్టేస్తాం.. ఎయిర్‌సెల్, బ్రూక్‌ఫీల్డ్ లావాదేవీలు పూర్తయితే వచ్చే నిధుల నుంచి సుమారు రూ. 25,000 కోట్ల మేర తిరిగి చెల్లిస్తామని ఇప్పటికే బ్యాంకులకు తెలియజేసినట్లు ఆర్‌కామ్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా చెల్లింపులు జరుపుతామని చెప్పినట్లు వివరించాయి. నిర్దేశిత రీపేమెంట్స్ అన్నింటితో పాటు ప్రోరాటా ప్రాతిపదికన అన్ని బ్యాంకులకు గణనీయంగా ప్రీపేమెంట్ (ముందస్తుగా రుణ చెల్లింపు) చేసేందుకు కూడా ఈ మొత్తం సరిపోతుందని వివరించాయి. వీలైనంత త్వరగా సెప్టెంబర్ 30లోగానే ఈ రెండు లావాదేవీలు పూర్తయ్యేలా అనుమతులు పొందడంపై ఆర్‌కామ్ దృష్టి సారించింది. ఇప్పటికే పలు అనుమతులు వచ్చాయని సంస్థ పేర్కొంది. టవర్స్ విభాగం రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో 51 శాతం వాటాలను కెనడాకి చెందిన బ్రూక్‌ఫీల్డ్ గ్రూప్‌కి ఆర్‌కామ్ దాదాపు రూ. 11,000 కోట్లకు విక్రయిస్తోంది. అలాగే, ఎయిర్‌సెల్, ఆర్‌కామ్‌ల వైర్లెస్ విభాగాలు విలీనం కానున్నాయి. ఈ లావాదేవీలన్నీ పూర్తయితే 2018 నాటికి తమ రుణభారం 70 శాతం మేర తగ్గగలదని ఆర్‌కామ్ గతంలో పేర్కొంది. 52 వారాల కనిష్టానికి షేరు.. ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరాశపర్చిన నేపథ్యంలో సోమవారం ఆర్‌కామ్ షేరు బీఎస్ఈలో ఏకంగా 24 శాతం క్షీణించింది. రూ. 25.65 వద్ద ప్రారంభమైన షేరు ధర ఆ తర్వాత ఒక దశలో 23.64 శాతం పతనమై రూ. 19.70కి పడిపోయింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి. చివరికి 20.54 శాతం నష్టంతో రూ. 20.50 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలో కూడా ఆర్‌కామ్ షేరు 23.49 శాతం తగ్గి రూ. 19.70 స్థాయికి పతనమైంది. ఆఖరికి రూ. 19.22 శాతం క్షీణతతో రూ. 20.80 వద్ద ముగిసింది. ఈ షేరు 2008 జనవరి నెలలో రూ. 800కుపైగా ధరతో ట్రేడయ్యింది. ఎస్ఎంఏ అంటే .. వడ్డీ కట్టడంలో జాప్యం జరిగిన ఖాతాలను ఎస్ఎంఏ (స్పెషల్ మెన్షన్ అకౌంట్స్) అసెట్స్ కింద వర్గీకరిస్తారు. జాప్యం 30 రోజుల్లోపు ఉంటే ఎస్ఎంఏ–1 కింద, 60 రోజులు ఆపైన అయితే ఎస్ఎంఏ–2 కింద వర్గీకరిస్తారు. అదే 90 రోజులయితే బ్యాంకులు సదరు రుణ ఖాతాను నికర నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా రాస్తాయి.