అప్పుల కుప్ప.. ఆర్‌కామ్‌ | Banks red flag Anil Ambani's RCom over missed loan payments | Sakshi
Sakshi News home page

అప్పుల కుప్ప.. ఆర్‌కామ్‌

Published Mon, May 29 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM

అప్పుల కుప్ప.. ఆర్‌కామ్‌

అప్పుల కుప్ప.. ఆర్‌కామ్‌

రూ. 42,000 కోట్లకు పైగా రుణభారం
► బ్యాంకులకు వడ్డీ డిఫాల్ట్‌
► కంపెనీ ఖాతాను ఎస్‌ఎంఏ–1 కింద వర్గీకరించిన బ్యాంకులు
► బాండ్ల రేటింగ్‌ కూడా డౌన్‌గ్రేడ్‌
► ఆల్‌టైమ్‌ కనిష్టానికి షేరు


దిగ్గజ టెలికం సంస్థగా వెలుగొందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ప్రస్తుతం రుణాల భారంతో కుదేలవుతోందా? వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉందా? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. వడ్డీ బకాయి కారణంగా దేశీయంగా కనీసం 10 బ్యాంకులు ఆర్‌కామ్‌కి ఇచ్చిన రుణాలను ఎస్‌ఎంఏ–1, ఎస్‌ఎంఏ–2 కేటగిరీల్లో వర్గీకరించినట్లు తెలుస్తోంది. మరో పక్షం రోజులు దాటితే కొన్ని బ్యాంకులు ఇక వీటిని మొండి బకాయి ఖాతాల (ఎన్‌పీఏ) కింద కూడా వర్గీకరించాల్సి రావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. 

ఆర్‌కామ్‌కి రుణభారంతో పాటు ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ కూడా పెరిగిపోయిన నేపథ్యంలో రేటింగ్‌ ఏజెన్సీలు కేర్, ఇక్రా ఇప్పటికే కంపెనీ బాండ్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు కూడా వీటికి తోడవడంతో గడిచిన రెండు వారాలుగా క్షీణిస్తున్న ఆర్‌కామ్‌ షేర్లు సోమవారం ఒక్కరోజే ఏకంగా 24 శాతం పతనమయ్యాయి. బ్యాంకులు ఎస్‌ఎంఏ కింద వర్గీకరించిన రుణాలకు సంబంధించిన సమాచారం ఇంకా లభ్యం కావడానికి ముందే రేటింగ్‌ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్‌ చేశాయి. రిలయన్స్‌ జియో పోటీ కారణంగా ఆర్‌కామ్‌పై ప్రతికూల ప్రభావం పడగలదని పేర్కొన్న కేర్‌.. తాజాగా డిఫాల్ట్‌ సంగతి కూడా తెలిస్తే మరింతగా కఠినతరమైన రేటింగ్‌ ప్రకటించే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

ఇక ఆదాయాల ఆర్జనపై కంపెనీ సామర్ధ్యంపై సందేహాలు, జియో కారణంగా లాభదాయకతపై ప్రతికూల ప్రభావ అంచనాల మూలంగా.. ఆర్‌కామ్‌ గ్రూప్‌ రేటింగ్‌ను ఇక్రా బిబిబి నుంచి బిబి స్థాయికి డౌన్‌గ్రేడ్‌ చేసింది. మొండిబకాయిల వసూళ్లపై బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తుండటం వల్ల ఎన్‌పీఏ స్థాయికి అటూ ఇటూగా ఉన్న ఖాతాలపై కూడా మరింతగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్లు ప్రత్యేకంగా ఆర్‌కామ్‌ను ప్రస్తావించకుండా డాల్టన్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ఇండియా డైరెక్టర్‌ యూఆర్‌ భట్‌ అభిప్రాయపడ్డారు.

పెరిగిన నష్టాలు..
పోటీతో పాటు పెరుగుతున్న వడ్డీ వ్యయాలు మొదలైనవి ఆర్‌కామ్‌ ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.  జనవరి–మార్చ్‌ త్రైమాసికంలో ఆర్‌కామ్‌ ఏకంగా రూ. 966 కోట్ల నష్టం ప్రకటించడంతో వరుసగా రెండో క్వార్టర్‌లో కూడా నష్టం నమోదు చేసినట్లయింది. మార్చి 31 ఆఖరు నాటికి కంపెనీ రుణభారం రూ. 42,000 కోట్ల పైచిలుకు ఉంది.

జియో ఆఫర్ల నేపథ్యంలో గడిచిన 20 ఏళ్లలో టెలికం రంగం ఆదాయాలు తొలిసారిగా తగ్గాయని, దాంతో ఆపరేటింగ్‌ మార్జిన్లు భారీగా తగ్గగా.. రుణాల కారణంగా వడ్డీ భారం గణనీయంగా పెరిగిపోయిందని శనివారం ఫలితాల ప్రకటన సందర్భంగా ఆర్‌కామ్‌ పేర్కొంది. కంపెనీ వద్ద నగదు నిల్వలు, నిర్వహణాపరమైన ఆదాయాలు చూస్తుంటే.. స్వల్పకాలిక రుణాల చెల్లింపులు, మూలధన వ్యయాలకు కూడా సరిగ్గా సరిపోకపోవచ్చని లుక్రోర్‌ అనలిటిక్స్‌ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది.

నిధులొస్తున్నాయ్‌..కట్టేస్తాం..
ఎయిర్‌సెల్, బ్రూక్‌ఫీల్డ్‌ లావాదేవీలు పూర్తయితే వచ్చే నిధుల నుంచి సుమారు రూ. 25,000 కోట్ల మేర తిరిగి చెల్లిస్తామని ఇప్పటికే బ్యాంకులకు తెలియజేసినట్లు ఆర్‌కామ్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోగా చెల్లింపులు జరుపుతామని చెప్పినట్లు వివరించాయి. నిర్దేశిత రీపేమెంట్స్‌ అన్నింటితో పాటు ప్రోరాటా ప్రాతిపదికన అన్ని బ్యాంకులకు గణనీయంగా ప్రీపేమెంట్‌ (ముందస్తుగా రుణ చెల్లింపు) చేసేందుకు కూడా ఈ మొత్తం సరిపోతుందని వివరించాయి.

వీలైనంత త్వరగా సెప్టెంబర్‌ 30లోగానే ఈ రెండు లావాదేవీలు పూర్తయ్యేలా అనుమతులు పొందడంపై ఆర్‌కామ్‌ దృష్టి సారించింది. ఇప్పటికే పలు అనుమతులు వచ్చాయని సంస్థ పేర్కొంది. టవర్స్‌ విభాగం రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌లో 51 శాతం వాటాలను కెనడాకి చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ గ్రూప్‌కి ఆర్‌కామ్‌ దాదాపు రూ. 11,000 కోట్లకు విక్రయిస్తోంది. అలాగే, ఎయిర్‌సెల్, ఆర్‌కామ్‌ల వైర్‌లెస్‌ విభాగాలు విలీనం కానున్నాయి. ఈ లావాదేవీలన్నీ పూర్తయితే 2018 నాటికి తమ రుణభారం 70 శాతం మేర తగ్గగలదని ఆర్‌కామ్‌ గతంలో పేర్కొంది.

52 వారాల కనిష్టానికి షేరు..
ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపర్చిన నేపథ్యంలో సోమవారం ఆర్‌కామ్‌ షేరు బీఎస్‌ఈలో ఏకంగా 24 శాతం క్షీణించింది. రూ. 25.65 వద్ద ప్రారంభమైన షేరు ధర ఆ తర్వాత ఒక దశలో 23.64 శాతం పతనమై రూ. 19.70కి పడిపోయింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి. చివరికి 20.54 శాతం నష్టంతో రూ. 20.50 వద్ద ముగిసింది. అటు ఎన్‌ఎస్‌ఈలో కూడా ఆర్‌కామ్‌ షేరు 23.49 శాతం తగ్గి రూ. 19.70 స్థాయికి పతనమైంది. ఆఖరికి రూ. 19.22 శాతం క్షీణతతో రూ. 20.80 వద్ద ముగిసింది.  ఈ షేరు 2008 జనవరి నెలలో రూ. 800కుపైగా ధరతో ట్రేడయ్యింది.

ఎస్‌ఎంఏ అంటే ..
వడ్డీ కట్టడంలో జాప్యం జరిగిన ఖాతాలను ఎస్‌ఎంఏ (స్పెషల్‌ మెన్షన్‌ అకౌంట్స్‌) అసెట్స్‌ కింద వర్గీకరిస్తారు. జాప్యం 30 రోజుల్లోపు ఉంటే ఎస్‌ఎంఏ–1 కింద, 60 రోజులు ఆపైన అయితే ఎస్‌ఎంఏ–2 కింద వర్గీకరిస్తారు. అదే 90 రోజులయితే బ్యాంకులు సదరు రుణ ఖాతాను నికర నిరర్ధక ఆస్తి (ఎన్‌పీఏ)గా రాస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement