మహిళలకు వడ్డీ లేని రుణాలందించాలి
మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సృజన
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : గతంలో స్త్రీనిధి ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఉండేవని, ప్రస్తుతం వడ్డీ వసూలు చేస్తున్నారని, గతంలో మాదిరిగా వడ్డీ లేని రుణాలను పునరుద్ధరించాలని మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వి.సృజన అన్నారు. శుక్రవారం పట్టణంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య సదుస్సులో ఆమె మాట్లాడారు. ఎన్నికల ముందు మహిళా గ్రూపులకు రూ.10 లక్షల చొప్పున వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగానే డ్వాక్రా మహిళ రుణాలను మాఫీ చేయాలని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలకు స్కాలర్‌షిప్‌ను రూ.1500 అందించాలని, అభయహస్తం పింఛన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, అఘారుుత్యాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. షీ టీంలను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా మండల, గ్రామ స్థాయిలో కూడా నియమించాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి, అధ్యక్షురాలు చంద్రకళ, ప్రభావతి, టీ.రాజకుమారి, కవిత, బోథ్ మండల కార్యాదర్శి గోదావరి, వై.కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.