అన్‌మోల్ అంబానీ, అనిల్ అంబానీ(పాత ఫోటో)
సాక్షి ముంబై: అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ అన్‌మోల్ అంబానీ (26) ఫస్ట్ డీల్‌లోనే అదరహో అనిపించుకున్నారు. 25 రెట్ల లాభాలతో ఫస్ట్ ఫండ్ రైజింగ్ డీల్‌లోనే జాక్‌పాట్ కొట్టేశారు. రిలయన్స్ గ్రూపు అధికార ప్రతినిధి ఈ లావాదేవీని ధృవీకరించారు. కోడ్‌మాస్టర్స్ సంస్థలోని వాటాను యూరోప్, యూకేకు చెందిన 30కి పైగా సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని సంస్థ వెల్లడించింది. ఇందుకు గాను సుమారు రూ.5 వేల కోట్ల వరకూ బిడ్లు దాఖలైనట్టు తెలిపారు.
బ్రిటీష్ గేమింగ్ డెవలప్‌మెంట్ సంస్థ కోడ్‌మాస్టర్స్‌లో రిలయన్స్ 60 శాతం వాటాను రూ.1700 కోట్లకు విక్రయించారు. ఏకంగా 25 రెట్లకు పైగా లాభానికి ఈ వాటాను అమ్మారు. దీంతో ముఖ్యంగా రుణ సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులుపడుతున్న అనిల్ అంబానీ పుత్రుడి విజయంతో సంతోషంగా ఉన్నారు. ఎఫ్ 1 సిరీస్ వీడియో గేమ్స్‌ను తయారీ దిగ్గజ సంస్థ కోడ్‌మాస్టర్స్‌లో 2009లో మెజార్టీ వాటాను అడాగ్ గ్రూప్ సంస్థ సుమారు రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఈ వాటాను కేవలం 60శాతం వాటాను 17వందల కోట్ల రూపాయలకు విక్రయించడం వ్యాపార వర్గాల్లో విశేషంగా నిలిచింది. కాగా ఈ డీల్ తరువాత కోడ్‌మాస్టర్స్ లో రూ.850 కోట్లు విలువైన 30 శాతం వరకూ వాటా అడాగ్ గ్రూప్ రిలయన్స్ సొంతం.
1986లో కోడ్ మాస్టర్స్ ఏర్పాటైంది. సుమారు 500మంది ఉద్యోగులతో ఇంగ్లాండ్‌లో మూడు, మలేషియాలో ఒక కార్యాలయంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2016 నాటికి, 31 మిలియన్ పౌండ్లుగా ఉన్న కోడ్‌మాస్టర్స్ ఆదాయం2018 ఆర్థిక సంవత్సరం నాటికి 64 మిలియన్ పౌండ్లతో రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. అలాగే కోడ్‌మాస్టర్స్ తో పాటు హాలీవుడ్ ఫిలిం స్టూడియో డ్రీమ్ వర్క్స్‌లో కూడా రిలయన్స్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment