సీబీడీటీ కొత్త చైర్‌పర్సన్ అనితా కపూర్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా అనితా కపూర్ నియమితులయ్యారు. వచ్చే యేడాది నవంబర్ వరకూ ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన అనితా కపూర్, 1978 ఇన్‌కమ్ ట్యాక్స్ కేడర్‌కు చెందినవారు. ఇప్పటివరకూ సీబీడీటీలో ఇన్‌కమ్ ట్యాక్స్ అండ్ కంప్యూటరైజేషన్ అండ్ లెజిస్లేషన్ వ్యవహారాల విభాగ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేవీ చౌదరి అక్టోబర్ 31న పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో కపూర్ నియామకం జరిగింది.
ఐదు స్థానాలు ఖాళీ...
సీబీడీటీలో చైర్మన్‌తో పాటు ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆదాయపు పన్ను శాఖ, ప్రత్యక్ష పన్నులకు సంబంధించి విధానాంశాల రూపకల్పన, పాలనా వ్యవహారాల నిర్ణయాల అమల్లో బోర్డ్ కీలకపాత్ర పోషిస్తుంది. కాగా ఇటీవల ఎటువంటి నియామకాలూ జరక్కపోవడంతో సీబీడీటీలో ప్రస్తుతం ఒకే ఒక్క సభ్యుడు- అరుణ్ కుమార్ జైన్ మాత్రమే పనిచేస్తున్నారు. బాధ్యతలన్నీ వీరిరువురే నిర్వర్తించాల్సి ఉంది.
సిట్ సలహాదారుగా చౌదరి...
కాగా సీబీడీటీ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన చౌదరి నల్లధనంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో ఏర్పాటయిన ప్రత్యేక విచారణా బృందానికి (సిట్) సలహాదారుగా నియమితులయ్యారు. చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారవడం తెలిసిన విషయమే.