
వాషింగ్టన్: టెక్ దిగ్గజం యాపిల్ అమ్మకాలు భారీగా పెరిగిన నేపథ్యంలో సంస్థ సీఈవో టిమ్ కుక్ జీతభత్యాలు గతేడాది ఏకంగా 22 శాతం పెరిగాయి. 2018లో ఆయన ఏకంగా 15.7 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 110 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. ఇందులో 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 21 కోట్లు) మూల వేతనం కాగా, 12 మిలియన్ డాలర్ల (దాదాపు 84 కోట్లు) బోనస్, 6,80,000 డాలర్లు ఇతరత్రా భత్యాల కింద చెల్లించినట్లు యాపిల్ పేర్కొంది.
2018లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా టిమ్ జీతభత్యాలు పెంచినట్లు సంస్థ వివరించింది. 2011లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన టిమ్.. 2016లో 8.7 మిలియన్ డాలర్లు, 2017లో 12.8 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు.