
ఆపిల్ కంపెనీ పన్ను నుంచి ఎలా తప్పించుకుంది?
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు, ఐపాడ్ అమ్మకాల ద్వారా ఏటా కోటానుకోట్ల రూపాయల లాభాలను గడిస్తున్న ఆపిల్ కంపెనీ చిల్లర పైసల్లో మాత్రమే ఎలా పన్ను చెల్లించగలుగుతున్నదన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. ఆపిల్ కంపెనీ 2014 సంవత్సరంలో తాను సంపాదించిన ప్రతి పది లక్షల డాలర్ల లాభాలపై 0.005 శాతం మాత్రమే పన్ను చెల్లించిందంటే ఆశ్చర్యం వేస్తోంది. మరి అది ఎలా సాధ్యమైంది?
ఆపిల్ కంపెనీ కొన్ని దశాబ్దాలుగా ఐర్లాండ్ నుంచి యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా, భారత్ దేశాలకు తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. అందుకోసం ఆపిల్ కంపెనీ 1991లో ఐర్లాండ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని అక్కడ రెండు సంస్థలను స్థాపించింది. వాటిలో ఆపిల్ సేల్స్ ఇంటర్నేషనల్ ఒకటికాగా, ఆపిల్ ఆపరేషన్స్ అన్నది మరో కంపెనీ. ఈ రెండు కంపెనీల ద్వారా జరిగే ఉత్పత్తుల విక్రయాలకు యూరోపియన్ యూనియన్‌లో భాగంగా కొనసాగుతున్న ఐర్లాండ్‌లో స్థానిక చట్టాల ప్రకారం12.5 శాతం కార్పొరేట్ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లోకెల్లా అతి తక్కువ పన్నును విధిస్తున్న దేశం ఐర్లాండే.
యూరోపియన్ యూనియన్‌లో సభ్య దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ సొంత పన్ను వ్యవస్థను ఏర్పాటు చేసుకునే హక్కు వాటికి ఉండడంతోప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలను, కంపెనీలను ఆహ్వానించడం కోసమే ఐర్లాండ్ చాలా తక్కువ పన్నును వసూలు చేస్తోంది. అందుకనే అపిల్‌తోపాటు గూగుల్, ఫేస్‌బుక్, ఈబే, ట్విట్టర్ లాంటి కంపెనీలన్నీ తమ యూరప్ ప్రధాన కార్యాలయాలన్నింటిని ఐర్లాండ్‌లోనే ఏర్పాటు చేశాయి.
ఐర్లాండ్ చట్టాల ప్రకారం లాభాల్లో 12.5 శాతాన్ని పన్నుగా చెల్లించాల్సి ఉన్నప్పుడు మరీ ఆపిల్ కంపెనీ తాను సాధించిన లాభాల్లో కేవలం 0.005 శాతాన్నే ఎలా చెల్లించగలిగింది. అసలు కిటుకంతా ఇక్కడే ఉంది. ఆపిల్ ఇంటర్నేషనల్ సేల్స్ సంస్థకు ఓ గోస్ట్ హెడ్‌క్వాటర్స్‌ను ఆపిల్ కంపెనీ ఏర్పాటు చేసింది. అంటే ఈ హెడ్‌క్వాటర్స్ కాగితం మీద తప్ప మరి ఎక్కడా కనిపించదు. హెడ్‌క్వాటర్స్ కింద ఎవరూ పనిచేయరు. ఎలాంటి లావాదేవీలు జరగవు. అప్పుడప్పుడు బోర్డు మీటింగ్‌లు తప్ప. కానీ లాభాల్లో మెజారిటీ వాటా హెడ్‌క్వాటర్స్ కోటాలోకి వెళుతుంది కనుక వాటికి నయాపైసా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. హెడ్‌క్వాటర్స్ అనే పేపర్ కంపెనీ ఉనికి తమ దేశంలో లేదుకనుక తమకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నది కూడా ఐర్లాండ్ ప్రభుత్వ వైఖరి. ఐర్లాండ్‌లో జరిగే కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలను అక్కడ రిజస్టర్ చేసిన రెండు కంపెనీల్లో చూపిస్తుంది. కానీ యూరప్, భారత్, ఆఫ్రికా దేశాల్లో జరిగిన విక్రయాలను ఎక్కువగా హెడ్ క్వాటర్స్ కింద చూపిస్తోంది ఆపిల్ కంపెనీ. 2011 సంవత్సరంలో ఆపిల్ కంపెనీ 1600 కోట్ల యూరోల లాభాలు గడించగా, కేవలం ఐదు కోట్ల యూరోలను మాత్రమే పన్నుగా చెల్లించింది.
అందుకనే ఇటీవల యూరోపియన్ కమిషన్ ఆపిల్ కంపెనీతోపాటు ఐర్లాండ్ ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. 13 బిలియన్ యూరోలను పన్ను కింద ఐర్లాండ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా ఆపిల్ కంపెనీని ఆదేశించింది. అయితే ఆ సొమ్మును తీసుకునేందుకు ఐర్లాండ్ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. స్థానిక చట్టాల ప్రకారమే తాము వ్యవహరించామని చెప్పుకుంటున్న ఆపిల్ కంపెనీ కూడా కమిషన్ తీర్పుపై అప్పీల్‌కు వెళుతోంది. ఆపిల్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం కూడా అండగా నిలిచింది.