ప్రాపర్టీ షోలకూ యాప్స్!
- అక్టోబర్ 2-4 వరకు ట్రెడా స్థిరాస్తి ప్రదర్శన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాప్స్.. యాప్స్.. యాప్స్! ఈ రోజుల్లో ప్రతిదానికీ స్మార్ట్‌ఫోన్‌ను టచ్ చేస్తే చాలు పనైపోయినట్టే! ఇంట్లోని డ్రెస్ నుంచి రోడ్డు మీది రెస్టారెంట్ వరకూ ప్రతి దానికి యాప్స్ వచ్చేశాయి మరి. ఇప్పుడీ జాబితాలో ప్రాపర్టీ షోలూ వచ్చిచేరాయి. అక్టోబర్ 2-4 వరకు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ఆధ్వర్యంలో జరగనున్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనున్న 6వ స్థిరాస్తి ప్రదర్శన కోసం తొలిసారిగా యాప్‌ను అభివృద్ధి చేశారు.
దీంతో స్థిరాస్తి ప్రదర్శనకు సంబంధించిన సమాచారంతో పాటు ఆయా స్టాళ్లలోని ప్రాపర్టీ వివరాలను, డీల్స్‌ను ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చని.. అవసరమైతే అక్కడి నుంచే బుకింగ్ చేసుకునే వీలుంటుందని ట్రెడా ప్రెసిడెంట్ దశరథ్ రెడ్డి చెప్పారు. గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్కిటెక్ట్‌లు సుమారు 180 స్టాళ్లను ద్వారా ప్రాజెక్ట్‌లు, వెంచర్లు, గృహ రుణాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందిస్తారన్నారు. గతేడాది ట్రెడా ప్రాపర్టీ షోకు 60 వేల మంది సందర్శకులు వచ్చారని.. ఈసారి రెండింత వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు.