ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌! | ARAI vehicles Soon in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

Published Thu, Jul 18 2019 1:22 PM | Last Updated on Thu, Jul 18 2019 1:22 PM

ARAI vehicles Soon in Hyderabad - Sakshi

వాహన రంగంలో పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన ఏఆర్‌ఏఐ 1966లో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వెహికల్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు ఈ సంస్థను స్థాపించాయి. మొత్తం 750 మంది వరకు ఉద్యోగులున్నారు. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన మహారాష్ట్రకు చెందిన రశ్మి ఉర్ధ్వరేషి ఏఆర్‌ఏఐలో 1983లో ట్రెయినీ ఇంజనీర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం డైరెక్టర్‌ హోదాలో ఉన్నారు.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డ్రైవర్‌ వాహనాన్ని నడుపుతున్న తీరు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు హెచ్చరించడం.. అలాగే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అలర్ట్‌ చేయడమేగాక, స్పందించే వ్యవస్థ వెహికల్‌లో ఉంటే! ఇంకేముంది.. ఎంచక్కా నిశ్చింతగా ప్రయాణించొచ్చు. ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) ఈ పనిలో నిమగ్నమవడమేగాక అందుకు తగ్గ వ్యవస్థను అభివృద్ధి చేసింది కూడా. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి భారత్‌లోని పలు వాహన తయారీ కంపెనీలు తమతో సం ప్రదింపులు జరుపుతున్నాయని ఏఆర్‌ఏఐ డైరెక్టర్‌ రశ్మి ఉర్ధ్వరేషి తెలిపారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బుధవారమిక్కడ నిర్వహించిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భం గా ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆమె మాటల్లోనే..

అయిదు దశల్లో..
ఇంటెలిజెంట్‌ డ్రైవింగ్‌ సిస్టమ్‌ను అయిదు దశల్లో అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. తుది దశ వచ్చేసరికి డ్రైవర్‌ లేకుండానే వాహనాన్ని నడిపేలా సాంకేతిక వ్యవస్థ తీసుకు రావాలన్నదే మా ధ్యేయం. వాహనాన్ని నడుపుతున్నప్పుడు తప్పులు జరగకుండా సాయపడే వ్యవస్థను సిద్ధం చేశాం. అలాగే ఆపత్కాలంలో హెచ్చరించడమేగాక డ్రైవర్‌తో పనిలేకుండా తనంత తానుగా నిర్ణయం తీసుకునేలా టెక్నాలజీ అభివృద్ధి పరిచాం. రోడ్డు మీద వాహనం వెళ్తున్నప్పుడు పక్కన పాదచారులు, విక్రేతలు ఉంటారు. జంతువులు, ఇతర వాహనాలు అడ్డు రావొచ్చు. రోడ్డు ప్రమాదం జరగకుండా నిలువరించడమే ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్ధేశం. ఏవైనా వాహన కంపెనీలు సొంతంగా ఇటువంటి టెక్నాలజీని రూపొందించినప్పటికీ, ఏఆర్‌ఏఐ నిర్దేశించినట్టు ఇవి ఉండాల్సిందే.

లైట్‌ వెయిట్‌ బస్సులు..
తేలికైన బస్సు నమూనాను (ప్రోటోటైప్‌) రెడీ చేశాం. భారత్‌లో మూడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఏఆర్‌ఏఐతో చేతులు కలిపాయి. ఇవి తమ సొంత తయారీ కేంద్రాల్లో ఈ బస్‌ల తయారీని ప్రారంభించాయి కూడా. నాణ్యమైన, ప్రత్యేక అల్యూమినియంతో తయారు చేయడం వల్ల బస్సు బరువు 700 కిలోలు తగ్గుతుంది. చాలా బలంగా కూడా ఉంటాయి. ఇంధన సామర్థ్యం 8% అధికమవుతుంది. ఛాసిస్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పటి వరకు బస్సులు స్టీల్‌ బాడీతో తయారవుతున్నాయి.  

ఇథనాల్‌తోనూ వాహనాలు..
పూర్తిగా ఇథనాల్‌ ఇంధనంగా వాహనాల తయారీ సాధ్యమే. ప్రత్యేక ఇంజిన్, స్పెషల్‌ ప్లాస్టిక్‌ విడిభాగాలను వాడాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో తొలిసారిగా టీవీఎస్‌ మోటార్‌ ఒక మోడల్‌ను విడుదల చేసింది. ఇథనాల్‌ ధర ప్రస్తుతం లీటరుకు రూ.45 ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్‌ మంచి ప్రత్యామ్నాయం కూడా.  

ధ్రువీకరణ పొందాల్సిందే..
సెంట్రల్‌ మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌ ప్రకారం.. టూ, త్రీ వీలర్లు, ప్యాసింజర్‌ వాహనాలు, ట్రక్కులు, వాణిజ్య వాహనాలు, నిర్మాణ రంగానికి అవసరమైన వెహికల్స్‌ ఏవైనా భారత్‌లో రోడ్డెక్కాలంటే తయారీ కంపెనీలు ఏఆర్‌ఏఐ నుంచి ధ్రువీకరణ పొందాలి. ఒక మోడల్‌ తాలూకు ప్రోటోటైప్‌ వెహికిల్‌ను కంపెనీలు ముందుగా రూపొందిస్తాయి. నాణ్యత, భారత్‌ స్టేజ్‌(బీఎస్‌) ప్రమాణాలు, క్రాష్‌ టెస్ట్‌ వంటివన్నీ పాస్‌ అయితేనే ప్రోటోటైప్‌కు సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. దీంతో ఆ మోడల్‌ వాహనాలను తయారు చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. ఏటా 500 వరకు వాహనాలు ఈ సర్టిఫికెట్‌ పొందుతున్నాయి. 300ల వరకు వాహనాలకు క్రాష్‌ టెస్ట్‌ చేయగలిగే సామర్థ్యం ఏఆర్‌ఏఐకి ఉంది. భద్రతకు పెద్దపీట వేస్తూ మెరుగైన సస్పెన్షన్, ప్రయాణికుల సౌలభ్యం, ఆధునిక బ్రేకింగ్‌ వ్యవస్థ వంటి వాటి అభివృద్ధిపై నిరంతరం పెద్ద ఎత్తున ఫోకస్‌ చేస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement