ARAI
-
రూ.150 ఖర్చుతో 300 కిమీ ప్రయాణం.. కొత్త కారుతో సత్తా చాటిన రైతుబిడ్డ!
గత ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్‌తో నడిచే కారును రూపొందించి అందరి చేత ప్రశంసలందుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' (Devendra Fadnavis) ఈ కారుని వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు ప్రత్యేకమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఇంత గొప్ప కారుని తయారు చేసిన నక్షనేనిని 'దేవేంద్ర ఫడ్నవిస్' కలిసి అభినందించారు. అంతే కాకుండా అతన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. గ్రీన్ కలర్లో కనిపించే ఈ కారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తూ 'సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్' పొందినట్లు హర్షల్ వివరించారు. ఇది ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో కారు తనకు తానుగానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఈ హైడ్రోజన్ కారుని తయారు చేయడానికి హర్షల్ నక్షనేనికి సుమారు రూ. 25 లక్షలు ఖర్చు అయినట్లు వెల్లడించాడు. ఈ కారు కేవలం రూ.150 హైడ్రోజన్‌తో ఏకంగా 300 కిమీ పరిధిని అందిస్తుందని తెలిపాడు. ఫెరారీ కారుని తలపించే డోర్స్, సన్‌రూఫ్ వంటివి ఇందులో మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్రీన్ కలర్ హోమ్మేడ్ హైడ్రోజన్ కారు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండటం వల్ల ఖచ్చితమైన లాంచ్ గురించి వివరించలేదు. అంతే కాకుండా ఈ కారుకు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించాల్సి ఉంది. దీనికోసం Aicars.in వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఇలాంటి వాహనాలు భారతదేశంలో చట్టవిరుద్ధం హర్షల్ నక్షనేని అద్భుతమైన సృష్టి అందరి ఆకట్టుకుంటున్నప్పటికీ.. భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇలాంటివి పబ్లిక్ రోడ్డుమీద ఉపయోగించడానికి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇండియాలో ఒక వాహనం రోడ్డు మీదికి రావాలంటే ఖచ్చితంగా 'ఏఆర్ఏఐ' (Automotive Research Association of India) దృవీకరించాలి. మన దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను ప్రవేశపెడుతున్నాయి. కాబట్టి ఒక వాహనం పబ్లిక్ రోడ్ల మీదికి రావాలంటే సంబంధిత వివిధ అధికారుల నుంచి ఆమోదం పొందాలి. లేకుంటే ఇవి ప్రాజెక్ట్ కార్లుగా పరిగణించి, రేసింగ్ ట్రాక్‌లు లేదా ఫామ్‌హౌస్‌ల వంటి ప్రైవేట్ ప్రాపర్టీలకు మాత్రమే పరిమితం చేస్తారు. పబ్లిక్ రోడ్లలో ఇలాంటి వాహనాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్ ప్రస్తుతం మన దేశంలో హైడ్రోజన్ కార్ల వినియోగానికి కావాల్సిన కనీస సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ కార్ల కంటే ఎక్కువ పరిధిని, తక్కువ కాలుష్యం కలిగించే ఇలాంటి వాహనాలను వినియోగించాలని గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హైడ్రోజన్ కార్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. Blazing a trail from Chandrapur, Maharashtra, this AI-powered hydrogen car is a game-changer! It was great meeting Maharashtra's Innovative Genius, Harshal Nakshane, a farmer's son from Chandrapur, yesterday in Mumbai. He cracked a groundbreaking innovation - an AI-controlled… pic.twitter.com/tdANS9YNIp — Devendra Fadnavis (@Dev_Fadnavis) October 29, 2023 -
ఇంటెలిజెంట్ వెహికల్స్ రయ్!
వాహన రంగంలో పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన ఏఆర్ఏఐ 1966లో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఈ సంస్థను స్థాపించాయి. మొత్తం 750 మంది వరకు ఉద్యోగులున్నారు. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మహారాష్ట్రకు చెందిన రశ్మి ఉర్ధ్వరేషి ఏఆర్‌ఏఐలో 1983లో ట్రెయినీ ఇంజనీర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం డైరెక్టర్ హోదాలో ఉన్నారు. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రైవర్ వాహనాన్ని నడుపుతున్న తీరు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు హెచ్చరించడం.. అలాగే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అలర్ట్ చేయడమేగాక, స్పందించే వ్యవస్థ వెహికల్లో ఉంటే! ఇంకేముంది.. ఎంచక్కా నిశ్చింతగా ప్రయాణించొచ్చు. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ఈ పనిలో నిమగ్నమవడమేగాక అందుకు తగ్గ వ్యవస్థను అభివృద్ధి చేసింది కూడా. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి భారత్‌లోని పలు వాహన తయారీ కంపెనీలు తమతో సం ప్రదింపులు జరుపుతున్నాయని ఏఆర్ఏఐ డైరెక్టర్ రశ్మి ఉర్ధ్వరేషి తెలిపారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ బుధవారమిక్కడ నిర్వహించిన ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భం గా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆమె మాటల్లోనే.. అయిదు దశల్లో.. ఇంటెలిజెంట్ డ్రైవింగ్ సిస్టమ్‌ను అయిదు దశల్లో అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. తుది దశ వచ్చేసరికి డ్రైవర్ లేకుండానే వాహనాన్ని నడిపేలా సాంకేతిక వ్యవస్థ తీసుకు రావాలన్నదే మా ధ్యేయం. వాహనాన్ని నడుపుతున్నప్పుడు తప్పులు జరగకుండా సాయపడే వ్యవస్థను సిద్ధం చేశాం. అలాగే ఆపత్కాలంలో హెచ్చరించడమేగాక డ్రైవర్‌తో పనిలేకుండా తనంత తానుగా నిర్ణయం తీసుకునేలా టెక్నాలజీ అభివృద్ధి పరిచాం. రోడ్డు మీద వాహనం వెళ్తున్నప్పుడు పక్కన పాదచారులు, విక్రేతలు ఉంటారు. జంతువులు, ఇతర వాహనాలు అడ్డు రావొచ్చు. రోడ్డు ప్రమాదం జరగకుండా నిలువరించడమే ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్ధేశం. ఏవైనా వాహన కంపెనీలు సొంతంగా ఇటువంటి టెక్నాలజీని రూపొందించినప్పటికీ, ఏఆర్ఏఐ నిర్దేశించినట్టు ఇవి ఉండాల్సిందే. లైట్ వెయిట్ బస్సులు.. తేలికైన బస్సు నమూనాను (ప్రోటోటైప్) రెడీ చేశాం. భారత్‌లో మూడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఏఆర్‌ఏఐతో చేతులు కలిపాయి. ఇవి తమ సొంత తయారీ కేంద్రాల్లో ఈ బస్‌ల తయారీని ప్రారంభించాయి కూడా. నాణ్యమైన, ప్రత్యేక అల్యూమినియంతో తయారు చేయడం వల్ల బస్సు బరువు 700 కిలోలు తగ్గుతుంది. చాలా బలంగా కూడా ఉంటాయి. ఇంధన సామర్థ్యం 8% అధికమవుతుంది. ఛాసిస్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పటి వరకు బస్సులు స్టీల్ బాడీతో తయారవుతున్నాయి. ఇథనాల్‌తోనూ వాహనాలు.. పూర్తిగా ఇథనాల్ ఇంధనంగా వాహనాల తయారీ సాధ్యమే. ప్రత్యేక ఇంజిన్, స్పెషల్ ప్లాస్టిక్ విడిభాగాలను వాడాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో తొలిసారిగా టీవీఎస్ మోటార్ ఒక మోడల్‌ను విడుదల చేసింది. ఇథనాల్ ధర ప్రస్తుతం లీటరుకు రూ.45 ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ మంచి ప్రత్యామ్నాయం కూడా. ధ్రువీకరణ పొందాల్సిందే.. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారం.. టూ, త్రీ వీలర్లు, ప్యాసింజర్ వాహనాలు, ట్రక్కులు, వాణిజ్య వాహనాలు, నిర్మాణ రంగానికి అవసరమైన వెహికల్స్ ఏవైనా భారత్‌లో రోడ్డెక్కాలంటే తయారీ కంపెనీలు ఏఆర్ఏఐ నుంచి ధ్రువీకరణ పొందాలి. ఒక మోడల్ తాలూకు ప్రోటోటైప్ వెహికిల్‌ను కంపెనీలు ముందుగా రూపొందిస్తాయి. నాణ్యత, భారత్ స్టేజ్(బీఎస్) ప్రమాణాలు, క్రాష్ టెస్ట్ వంటివన్నీ పాస్ అయితేనే ప్రోటోటైప్‌కు సర్టిఫికెట్ జారీ చేస్తారు. దీంతో ఆ మోడల్ వాహనాలను తయారు చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. ఏటా 500 వరకు వాహనాలు ఈ సర్టిఫికెట్ పొందుతున్నాయి. 300ల వరకు వాహనాలకు క్రాష్ టెస్ట్ చేయగలిగే సామర్థ్యం ఏఆర్ఏఐకి ఉంది. భద్రతకు పెద్దపీట వేస్తూ మెరుగైన సస్పెన్షన్, ప్రయాణికుల సౌలభ్యం, ఆధునిక బ్రేకింగ్ వ్యవస్థ వంటి వాటి అభివృద్ధిపై నిరంతరం పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాం. -
హైదరాబాద్‌లో బస్సు తయారీ ప్లాంట్
♦ రూ.250 కోట్లతో ఆరంభించనున్న డెక్కన్ ఆటో ♦ ఏటా 3,000 బస్‌ల తయారీ సామర్థ్యం ♦ రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ♦ కంపెనీ చైర్మన్ ఎంఎస్ఆర్వీ ప్రసాద్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆటోమొబైల్ రంగంలో ఉన్న డెక్కన్ ఆటో హైదరాబాద్ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో బస్‌ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. ఏటా 3,000 బస్‌ల తయారీ సామర్థ్యంతో రూ.250 కోట్లతో మెదక్ జిల్లా పటాన్చెరు దగ్గర ఇది ఏర్పాటయింది. ఏఆర్ఏఐ ధ్రువీకరణ ఉన్న ఈ ప్లాంటు వార్షిక సామర్థ్యం... వచ్చే ఆరేళ్లలో 6,000 యూనిట్లకు పెంచుతారు. 8 నుంచి 18 మీటర్ల పొడవున్న బస్‌లను ఈ ప్లాంటులో రూపొందిస్తారు. ఈ బస్సుల్ని ఆఫ్రికా, ఆసియా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని డెక్కన్ ఆటో చైర్మన్ ఎం.శివరామ వరప్రసాద్ తెలిపారు. చైనా ప్రభుత్వ కంపెనీ అయిన జోంగ్టాంగ్ సాంకేతిక సహకారంతో లగ్జరీ కోచ్‌లను తయారు చేస్తామన్నారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు చేతుల మీదుగా శనివారం ప్లాంటును ప్రారంభిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలియజేశారు. కరోనా బస్‌లు సైతం...డెక్కన్ ఆటో ఈ ప్లాంటు ద్వారా బస్‌ల తయారీలోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే గ్రూప్ కంపెనీ అయిన కరోనా బస్ మాన్యుఫ్యాక్చరర్స్ ఈ విభాగంలో సేవలందిస్తోంది. కొత్త ప్లాంటులో కరోనా, డెక్కన్ బ్రాండ్ల బస్‌లను తయారు చేస్తామని కరోనా డెరైక్టర్ ఎం.బాలాజీ రావు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు.. డెక్కన్ బ్రాండ్ బస్ రూ.1 కోటి వరకు, కరోనా బస్ రూ.70 లక్షల వరకు ధర ఉంది. సిమెంటు రంగంలోనూ... శివరామ వరప్రసాద్‌కు కరోనాలో 51 శాతం, డెక్కన్ ఆటోలో 70 శాతంపైగా వాటా ఉంది. ఈయన ప్రమోటర్‌గా ఉన్న గ్రూప్ కంపెనీకి ఆఫ్రికాలో డైమండ్ బ్రాండ్‌తో 15 సిమెంటు ప్లాంట్లు ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో అత్యధిక వాటా ఈ బ్రాండ్‌దే. స్టీల్ ప్లాంటులతో పాటు టోగో దేశంలో రైల్వేలను నిర్వహిస్తోంది. ఆఫ్రికాలోనే 2,000 ఎకరాల్లో ఉప్పు పండిస్తోంది. హైదరాబాద్‌లో తొలి స్టూడియో అయిన సారధి స్టూడియోస్ కూడా ఈ గ్రూప్‌నకు చెందినదే. ఒరిస్సాలో తోషాలి బ్రాండ్‌తో సిమెంటు ప్లాంటు ఉంది. వైజాగ్ వద్ద వోల్టా ఫ్యాషన్స్ పేరుతో గార్మెంట్స్ తయారీ యూనిట్ ఉంది. పెపే జీన్స్, ఓనీల్, కిలివాచ్, ఏసాస్, సియా హెరింగ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు దుస్తులను సరఫరా చేస్తోం ది. గ్రూప్ టర్నోవర్ రూ.10,700 కోట్లపైమాటే.