జీఎస్టీ తర్వాత ఈ కార్ల ధరలు పైపైకే..
Published Fri, Jun 23 2017 1:29 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM
దేశవ్యాప్తంగా జీఎస్టీ మరికొన‍్ని రోజుల్లో అమలుకాబోతుండటంతో, పాత ఇన్వెంటరీని విక్రయించుకోవడానికి దాదాపు అన్ని సంస్థలు డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక వాహన రంగ సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ డిస్కౌంట్లతో కార్లను విక్రయానికి తీసుకొచ్చాయి. మెర్సిడెస్ నుంచి ఫోర్డ్ వరకు అన్ని సంస్థలు డిస్కౌంట్ల బాట పట్టాయి. కానీ జీఎస్టీ అమలు తర్వాత వాహనరంగ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏ కారు కొంటే ఎంత మేర జేబుకు చిల్లుపడుతుంది? ఏ కార్ల ధరలు తగ్గొచ్చూ అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జీఎస్టీ తర్వాత బడ్జెట్ కార్లు, మాస్-మార్కెట్ కొనుగోలు చేసే కార్ల ధరలు 3 శాతం నుంచి 5 శాతం పైకి ఎగుస్తాయని తెలుస్తోంది. అంటే కారు ధర రూ.5 లక్షలు ఉందనుకోండి.. ఈ కారు ధర జీఎస్టీ అమలు తర్వాత రూ.15వేల నుంచి రూ.25వేల మేర పెరుగుతుంది.
మార్కెట్లో ఎక్కువగా పాపులర్ కారు అయిన మారుతీ సుజుకీ ఆల్టో ధర కూడా అత్యధికంగా పైకి ఎగుస్తుందట. ప్రస్తుత పన్ను రేటు దీనిపై 25-27.5శాతముంటే, అది కాస్త 29శాతం కంటే పైగా పెరుగుతోంది. దీంతో ఆల్టో ధరలు పెరుగనున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ డీలర్లు ఆల్టో, స్విఫ్ట్ లపై రూ.25వేల నుంచి రూ.35వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇతర కారు సంస్థలు కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. హ్యుందాయ్ రూ.25వేల నుంచి రూ.2 లక్షల 50వేల వరకు ధర ప్రయోజనాలను అందింస్తుండగా.. డాట్సన్ సంస్థ ఉచిత ఇన్సూరెన్స్, తగ్గింపు వడ్డీరేట్లను అందిస్తోంది.
ఒక్క మారుతీ ఆల్టో ధర మాత్రమే కాక, రెనాల్డ్ క్విడ్ ధర కూడా దాదాపు రూ.7,500 వరకు పెరుగనుంది. ప్రస్తుతం రెనాల్డ్ క్విడ్ ధర రూ.3,32,312(ఎక్స్ షోరూం-ఢిల్లీ) ఉంది. దీని పన్ను రేటు జీఎస్టీతో 26శాతం నుంచి 29శాతానికి పెరుగుతోంది. ఈ పన్ను పెరగడమే కారు ధర పైకి ఎగియడానికి దోహదం చేస్తోంది. హోండా సిటీ కారు కూడా రూ.10,735మేర పెరుగుతోంది. ప్రస్తుతం దీని ధర 10,12,797 రూపాయలుగా ఉంది. జీఎస్టీతో ఎక్కువగా డీజిల్ కార్లు ప్రభావం చెందుతాయని, వీటి ధరలు 21వేల రూపాయల వరకు పెరుగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మారుతీ సుజుకీ డిజైర్ ధర ఎక్స్ షోరూం-ఢిల్లీలో ప్రస్తుతం రూ.7,76,000 ఉంటే, అది కాస్త జీఎస్టీ తర్వాత 21వేల రూపాయలు పెరిగి, 7,97,300 రూపాయలకు చేరుకోనుంది.
Advertisement