చిన్న సంస్థల కోసం రెండు ఫండ్స్ | Arun Jaitley launches two funds by SIDBI | Sakshi
Sakshi News home page

చిన్న సంస్థల కోసం రెండు ఫండ్స్

Published Wed, Aug 19 2015 1:53 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

చిన్న సంస్థల కోసం రెండు ఫండ్స్ - Sakshi

చిన్న సంస్థల కోసం రెండు ఫండ్స్

రూ. 12,000 కోట్లతో ఏర్పాటు
- ఆవిష్కరించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
ముంబై:
చిన్న సంస్థలకు తోడ్పాటు అందించే దిశగా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి) ఆధ్వర్యంలో రెండు ఫండ్స్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఆవిష్కరించారు. వీటి మొత్తం మూలనిధి రూ. 12,000 కోట్లు ఉంటుంది. ఇందులో భారత ఆకాంక్ష నిధి (ఐఏఎఫ్- ఫండ్ ఆఫ్ ఫండ్స్) కింద రూ. 2,000 కోట్లు, సిడ్బి మేక్ ఇన్ ఇండియా లోన్ ఫర్ ఎంటర్‌ప్రైజెస్ (స్మైల్) స్కీము కింద రూ. 10,000 కోట్లు ఉంటాయి. వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు స్టార్టప్స్, చిన్న..మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) కోసం సమీకరించే విధంగా ఐఏఎఫ్ ఉంటుందని జైట్లీ తెలిపారు.

దీనికి బీమా దిగ్గజం ఎల్‌ఐసీ భాగస్వామిగా ఉండనుందని వివరించారు. మరోవైపు, ఎంఎస్‌ఎంఈలు వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించేలా.. తక్కువ వడ్డీ రేటుపై టర్మ్ లోన్లు మొదలైనవి అందించడం స్మైల్ పథకం ప్రధానోద్దేశమని పేర్కొన్నారు. కాగా దాదాపు 2 లక్షల మందికి ఉపాధి కల్పించే 13,000 సంస్థలు స్మైల్‌తో ప్రయోజనం పొందగలవని సిడ్బీ తెలిపింది. ఎస్సీ, ఎస్టీలు, అంగవైకల్యం గలవారు, మహిళల నిర్వహించే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఈ పథకం కింద ఉంటాయని సిడ్బి సీఎండీ క్షత్రపతి శివాజి చెప్పారు.
 
స్టార్టప్ లిస్టింగ్ సులభతరం..: సెబీ చీఫ్
స్టార్టప్ సంస్థలు సులభతరంగా లిస్టింగ్ అయ్యేందుకు కొత్త నిబంధనలు తోడ్పడగలవని సెబీ చైర్మన్ యూకే సిన్హా తెలిపారు.  ప్రస్తుతం భారత్‌లో టెక్నాలజీ స్టార్టప్‌ల సంఖ్య 3,000 పైగా ఉందని, ఏటా 800-1,000 కొత్తవి పుట్టుకొస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే 2020 నాటికి స్టార్టప్‌ల సంఖ్య 10,000 మార్కును దాటేయగలదని చెప్పారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం స్టార్టప్ సంస్థల్లోకి వచ్చే విదేశీ వెంచర్ క్యాపిటల్ నిధుల్లో సింహభాగం.. ఈ-కామర్స్ రంగంలోకే వెడుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కార్యక్రమంలో తెలిపారు. అలా కాకుండా తయారీ, సౌర విద్యుత్, బయోటెక్నాలజీ వంటి రంగాల స్టార్టప్‌లకు కూడా నిధులు అందాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement