మీ షాపింగ్ మీ ఇష్టం..!
► కోరుకున్నట్టు వస్త్రాలు, నగలకు ‘బుజ్జు.కామ్’
► అవసరాలు, అభిరుచుల మేరకు కస్టమైజ్డ్ తయారీ
► యూకే, సింగపూర్, కెనడాలకూ త్వరలో విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్‌లైన్ షాపింగ్ అంటే అందరికీ సరదానే. కాకపోతే ఆన్‌లైన్‌లో ఉన్న వస్త్రాలు, నగల వంటి వాటిలో మనకు నచ్చిన వాటిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. కస్టమైజ్డ్ నగల కోసం బ్లూస్టోన్ వంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్లున్నా అవి ఆభరణాలకే పరిమితం. కాకపోతే హైదరాబాదీ స్టార్టప్ ‘బుజ్జు.కామ్’లో మాత్రం.. మన అవసరాలు, అభిరుచులను చెప్పేస్తే వస్త్రాలు, నగలు అన్నీ కస్టమైజ్డ్‌వి పొందొచ్చు. అంతేకాదు. మన అవసరాలు, అభిరుచులు చెబితే వాటిని బట్టి మనకు ఎలాంటి నగలు, వస్త్రాలు సెట్ అవుతాయో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ తరవాత వాటిని డిజైన్ చేయించుకోవచ్చు. బుజ్జు.కామ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నరేంద్ర రెడ్డి మాటల్లో ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్ గురించి మరిన్ని వివరాలు...
అందంతో పాటు పరిపూర్ణమైన వస్త్రాలు, నిండైన ఆభరణాలు ఉంటేనే మహిళలకు నిజమైన సౌందర్యం వస్తుందనేది నా అభిప్రాయం. అందుకే మన కట్టు, బొట్టును విదేశీయులూ గౌరవిస్తారు. ఈ సౌందర్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకే ఏడాదిన్నర క్రితం రూ.1.2 కోట్ల పెట్టుబడులతో బుజ్జు.కామ్‌ను ప్రారంభించాం. సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలుదారుల అభిరుచి, అవసరాల మేరకు ట్రెండ్‌కు తగ్గట్టుగా డిజైన్ చేసివ్వడమే ‘బుజ్జు.కామ్’ ప్రత్యేకత. కొనుగోలు చేసిన ఉత్పత్తులను బంధుమిత్రులు, స్నేహితులతో పంచుకొని వారి చేత కూడా షాపింగ్ చేయిస్తే వారికి బజ్ పాయింట్లు ఇచ్చి.. వారు ఆ తరవాత చేసే కొనుగోళ్లలో డిస్కౌంట్లు ఇస్తాం. ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ గిఫ్ట్‌లను కూడా అందజేస్తాం.
విస్తరణ బాటలో..
ఈ ఏడాది ముగింపు నాటికి సింగపూర్, కెనడా, యూకే దేశాల్లోనూ బుజ్జు.కామ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకోసం నిధుల సమీకరణపై దృష్టి సారించాం. త్వరలోనే బుజ్జు.కామ్‌లో పిల్లలు, పురుషుల దుస్తులు, పాదరక్షలను కూడా విక్రయిస్తాం.
ఎక్స్‌క్లూజివ్ డిజైన్లు..
మన దేశంతో పాటు అమెరికాలో కూడా బుజ్జు.కామ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో 10 వేల మంది, అమెరికాలో 4 వేల మంది రిపీటెడ్ కస్టమర్లున్నారు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో మహిళలకు సంబంధించిన చీరలు, చుడీదార్లు, డిజైనర్ వస్త్రాలతో పాటు ఆభరణాలనూ కొనుగో లు చేసే వీలుంది. పోచంపల్లి, గద్వాల్, కొత్తకోట, నారాయణగిరి, ధర్మవరం, ఉప్పాడ, కేరళ, కల కత్తా, కాంచీపురాలకు చెందిన వస్త్రాలు మా సైట్లో లభిస్తాయి. ఇతర షాపింగ్ సైట్లతో పోలిస్తే బుజ్జు.కామ్‌లో 50% ధర తక్కువగా ఉంటుంది. వస్త్రాలు, నగల తయారీదారులతో నేరుగా ఒప్పందం చేసుకోవడం వల్లే ఇది సాధ్యమయింది. ఎక్స్‌క్లూజివ్ డిజైన్లను అందించేందుకు ఆప్కో, పోచంపల్లి సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాం.