‘సిప్’ చేయడమే ఉత్తమం... | Assets of Chinese SOEs rise | Sakshi
Sakshi News home page

‘సిప్’ చేయడమే ఉత్తమం...

Published Mon, Jul 28 2014 12:42 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

‘సిప్’ చేయడమే ఉత్తమం... - Sakshi

‘సిప్’ చేయడమే ఉత్తమం...

 నేను రూ. 50,000 నుంచి రూ.60,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. బుల్‌మార్కెట్ నడుస్తున్న ప్రస్తుత నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన పనేనా? ఒకేసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయమంటారా? లేక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)ను ఎంచుకోమంటారా? సిప్ విధానాన్ని ఎంచుకుంటే ప్రస్తుత బుల్‌మార్కెట్ ప్రయోజనాలను నేను కోల్పోతానేమో అనిపిస్తోంది. తగిన సూచనలివ్వండి.  -ఆర్. సుధాకర్, వైజాగ్

ఎటువంటి పరిస్థితుల్లోనైనా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానాన్నే ఎంచుకోవడం ఉత్తమం. ఎనిమిది, తొమ్మిది నెలల నుంచి స్టాక్ మార్కెట్లలో బుల్న్ ్రనడుస్తూనే ఉంది. ఎప్పుడు కరెక్షన్ వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు, మార్కెట్లు పడిపోతే అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ కూడా పడిపోతుంది. అలాగని మార్కెట్లు పడిపోయేదాకా వేచిచూసి, ఇన్వెస్ట్ చేయడం కూడా సరైన విధానం కాదు.  మార్కెట్లు ఎప్పుడు పడిపోతాయో ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు.

చాలా మంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే, మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు, తమ దగ్గర డబ్బుల్లేకపోయినా, అప్పు తెచ్చైనా సరే, ఇన్వెస్ట్ చేస్తారు. మరోవైపు మార్కెట్లు పడిపోతున్నప్పుడు, తమ పెట్టుబడులు సగానికి సగం హరించుకుపోయినా అమ్మేస్తుంటారు. అధిక శాతం రిటైల్ ఇన్వెస్టర్లు చేసే తప్పు ఇదే. మార్కెట్ల నుంచి ప్రయోజనం పొందాలంటే, సరిగ్గా దీనికి వ్యతిరేకంగా వ్యవహరించాలి. అంటే మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు అమ్మేసి లాభం కళ్లజూడాలి. అయితే మార్కెట్లు గరిష్ట స్థాయిలకు ఎప్పుడు చేరుకుంటాయో, ఎప్పుడు కనిష్ట స్థాయిలకు పడిపోతాయో అంచనా వేయడం కష్టం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానం (సిప్) మేలు.
 
మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నప్పడు, ఈ మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న లిక్విడ్ డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్‌హౌస్ ఆధ్వర్యంలోని ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోండి. లిక్విడ్ డెట్‌ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌లోకి పెట్టుబడులను వారానికి/రెండు వారాలకు/ నెలకు ఒకసారి చొప్పున బదిలీ అయ్యే విధంగా సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ)ను ఎంచుకోండి. సిప్ విధానంలాగానే ఈ ఎస్‌టీపీ విధానం కూడా పనిచేస్తుంది.

తేడా అల్లా సిప్‌లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ సొమ్ములు మ్యూచువల్ ఫండ్‌లోకి వెళ్లిపోతాయి. ఎస్‌టీపీలో అయితే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కు బదిలీ అవుతాయి. ఎస్‌టీపీ విధానం వల్ల సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బుల కన్నా లిక్విడ్ ఫండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు ఎక్కువ వడ్డీ వస్తుంది. మరోవైపు ఈక్విటీల్లో చిన్న మొత్తాల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసినట్లూ అవుతుంది. లిక్విడ్ ఫండ్స్‌కు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు.
 
ఒకే ఫండ్‌హౌస్‌కు సంబంధించిన ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ పన్నును చెల్లించాల్సి ఉంటుందా? ఉదాహరణకు ఒక స్వల్పకాలిక డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కు నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) విధానంలో బదిలీ చేశాననుకోండి. డెట్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆర్జించిన లాభాలపై నేను ఏమన్నా పన్ను చెల్లించాల్సి ఉంటుందా?                    -ప్రతిభ, నిజామాబాద్
 
ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను  బదిలీ చేయడాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) అంటారు. సాధారణంగా చాలా మంది డెట్ ఫండ్స్‌లోని తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌లోకి ఈ ఎస్‌టీపీ విధానంలో బదిలీ చేస్తుంటారు. పన్ను బాధ్యత విషయానికొస్తే, ఇలా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించి, మరో కొత్త మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా భావిస్తారు. ఒకే ఫండ్ హౌస్‌కు చెందిన రెండు మ్యూచువల్ ఫండ్స్ మధ్య ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసినా అదే విధంగా పరిగణిస్తారు.

మీ స్వల్పకాలిక డెట్ ఫండ్‌పై మీకు దీర్ఘకాలిక లాభాలు వచ్చినట్లయితే, మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, మీరు  మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొన్న 36 నెలలలోపే వాటిని వేరే ఫండ్‌లోకి బదిలీ చేస్తే మీరు స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాబడులను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్నును లెక్కిస్తారు. ఒక వేళ 36 నెలల తర్వాత వేరే ఫండ్‌లోకి బదిలీ చేస్తే, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. ఈ దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌పై ఇండేక్సేషన్‌తో కలిపి 20 శాతం పన్ను లెక్కిస్తారు. ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదికి మించి కొనసాగిస్తే, మీ తుది రాబడులపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే దీర్ఘకాలిక రాబడులపై పన్ను మినహాయింపులుండడమే దీనికి కారణం.
 
మ్యూచువల్ ఫండ్‌హౌజ్‌లు డెరైక్ట్ ప్లాన్‌లపై ట్రయల్ కమీషన్‌ను  వసూలు చేస్తాయా?   -మహ్మద్ ఇక్బాల్, హైదరాబాద్
మ్యూచువల్ ఫండ్ యూనిట్లను అమ్మిపెట్టినందుకు ఏజెంట్లకు మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెల్లించే వార్షిక రికరింగ్ ఫీజులనే ట్రయల్ కమీషన్‌గా వ్యవహరిస్తారు.  డెరైక్ట్ ఫండ్స్ విషయంలో వినియోగదారుడికి, ఫండ్‌హౌజ్‌కు మధ్య ఎలాంటి దళారులుండరు. అందుకే డెరైక్ట్ ప్లాన్స్‌పై ఎలాంటి ట్రయల్ కమీషన్‌లుండవు. ఏజెంట్ చేసిన వ్యాపారాన్ని బట్టి రికరింగ్ ప్రాతిపదికన ట్రయల్ కమీషన్‌ను లెక్కిస్తారు. అందుకే ఎన్‌ఏవీ పెరిగినా, ఎక్కువ యూనిట్లను అమ్మిపెట్టినా ఏజెంట్లకు ప్రయోజనం కలుగుతుంది. ఈక్విటీ ఫండ్స్‌పై ట్రయల్ కమీషన్ 0.2 శాతం నుంచి 1 శాతంగా, డెట్ ఫండ్స్‌పై 0.10 శాతం నుంచి 1 శాతంగా ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement