
చివర్లో కొనుగోళ్లు
చైనా గణాంకాలతో మొదట్లో భారీ నష్టాలు.. చివర్లో రికవరి
- 97 పాయింట్ల నష్టంతో 25,622కు సెన్సెక్స్..
- 30 పాయింట్ల నష్టంతో 7,788కు నిఫ్టీ
చైనా గణాంకాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు క్షీణంచడంతో గురువారం మన స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. రోజంతా నష్టాల్లోనే సాగిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చివర్లో జరిగిన కొనుగోళ్ల కారణంగా భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్పనష్టాలకు పరిమితమైంది. బ్లూ చిప్ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 25,622 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 7.788 పాయింట్ల వద్ద ముగిశాయి.
నష్టాల తీరు: ఇంట్రాడేలో సెన్సెక్స్ 432 పాయింట్లు నష్టపోయింది. క్యాపిటల్ గూడ్స్, వాహన, కొన్ని బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల జోరు కారణంగా సెన్సెక్స్ భారీ నష్టాలకు తెరపడింది. లాభాల స్వీకరణ కూడా చోటు చేసుకుంది. చైనా వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, ఉత్పత్తిదారుల ధరలు వరుసగా 42వ నెలలోనూ తగ్గాయి. ఇది డిఫ్లేషన్‌కు సూచిక అనే నిపుణులంటున్నారు. ఇక స్టాండర్డ్ అండ్ పూర్స్ సంస్థ బ్రెజిల్ క్రెడిట్ రేటింగ్‌ను జంక్‌కు, ఆసియా దేశాల వృద్ధి అంచనాలను తగ్గించడం వంటి కారణాల వల్ల ఆసియా మార్కెట్లు క్షీణించాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 21 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
సియట్ షేర్... 3 నెలల్లో 100 శాతం వృద్ధి
టైర్ల కంపెనీ సియట్ షేర్ ధర మూడు నెలల్లో దాదాపు వంద శాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్ ఇంట్రాడేలో రికార్డ్ స్థాయిని(రూ.1,254) తాకి చివరకు 7 శాతం వృద్ధితో రూ.1,220 వద్ద ముగిసింది. ఈ ఏడాది జూన్ 9న రూ.614గా ఉన్న ఈ కంపెనీ షేర్ మూడు నెలల్లో దాదాపు వంద శాతం పెరగడం విశేషం. క్యూ1లో కంపెనీ నికర లాభం దాదాపు రెట్టింపు కావడంతో ఈ షేర్ జోరుగా పెరిగింది.