
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దారు ఆడి తన కార్ల ధరలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. తన పాపులర్ మోడల్ కార్లపై మూడునుంచి పదిలక్షల దాకా తగ్గింపును అందిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. మార్కెట్లో సవాళ్లను అధిగమించేందుకు భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై పరిమిత కాలానికి కస్టమర్ బెనిఫిట్ స్కీంను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆడి క్యూ3 తో పాటు, ప్రముఖ మోడల్స్ ఏ3, ఏ4, ఏ6 సెడాన్ల కార్ల కొనుగోళ్లపై రూ.2.7 లక్షల నుంచి రూ .10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. జూన్ వరకు ఈ తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
దిగుమతి సుంకాలు , ప్రతికూలమైన పన్నులు తదితర కారణాలు కారును సొంతంచేసుకోవాలని కలలు కనే కస్టమర్‌కు ప్రతిబంధకం కాకూడదని తాము భావిస్తున్నామని ఆడి ఇండియా ప్రెసిడెంట్ రాహిల్ అన్సారీ చెప్పారు. ఈ పథకం కింద 2018లో కొనుగోలు చేసి 2019లో వినియోగదారులు చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. మార్కెట్లో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి వ్యూహంలో భాగంగాగానే ఆ ఆఫర్ అని చెప్పింది. అంతేకాదు ఎంపిక చేసిన మోడల్‌కార్లపై ఆడి ఛాయిస్ పథకం కింద 57శాతం బై బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నట్టు వెల్లడించింది.
2016లో 7,720 యూనిట్లు విక్రయించగా, 2017 నాటికి 2 శాతం వృద్ధితో 7,876 యూనిట్లు విక్రయించామని ఆదివారం ప్రకటించింది. అయితే గత సంవత్సరం మే, జూన్ అమ్మకాలు మందగించడం, జీఎస్‌టీ సందర్భంగా విలాసవంతమైన కార్లపై భారీగా డిస్కౌంట్ల ఫలితంగా పుంజుకున్న అమ్మకాల నేపథ్యంలో ఆడి ఇండియా ఈ ఏడాది కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2018-19 బడ్జెట్లో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహమిచ్చే దిశగా దిగుమతి సుంకాన్నిపెంచారు. సీకేడీ కార్లపై 10నుంచి 15 శాతం సుంకం పెంచగా మోటారు వాహనాలు, మోటారు కార్లు, మోటారు సైకిల్స్‌కు చెందిన విడిభాగాలపై 7.5నుంచి 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీని పెంచిన సంగతి తెలిసిందే.




Comments
Please login to add a commentAdd a comment