‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధి: సింగపూర్, మలేసియాలకు చెందిన ‘పార్క్ వే పంటాయ్’ గ్రూపు నుంచి కాంటినెంటల్ ఆసుపత్రిని మళ్లీ తన చేతుల్లోకి తీసుకోవటానికి ప్రమోటరు డాక్టర్ గురునాథ్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీన్లో భాగంగా ఇటీవల అరబిందో ఫార్మా ప్రమోటర్లను కలిసి చర్చించడంతో అంతా డీల్ కుదిరిందనే అనుకున్నా... సాకారం కాలేదు. తాజాగా కొన్ని ఆర్థిక సంస్థల అండ తీసుకుని తానే మళ్లీ పార్క్ వే నుంచి వాటాను వెనక్కి తీసుకోవాలని గురునాథ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది కుదరని పక్షంలో చైనాకు చెందిన ఒక హెల్త్‌కేర్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా సమాచారం.
‘‘పార్క్‌వే గ్రూపునకు ప్రస్తుతం కాంటినెంటల్‌లో 52.3 శాతం వాటా ఉంది. తన అనుబంధ సంస్థ గ్లెనీగల్స్ డెవలప్‌మెంట్ పీటీఈ లిమిటెడ్ ద్వారా 2015లో దీన్ని 284 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో డీల్ బాగానే అనిపించినా... వాటా దక్కిన మరు క్షణం నుంచీ అది నియంత్రణను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. వైద్యుడైన డాక్టర్ గురునాథ్‌రెడ్డిని, ఆయన బృందాన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. అప్పటి నుంచీ ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. మళ్లీ వాటాను చేజిక్కించుకోవటానికి రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి పార్క్‌వేతో ఆయన కలిసి ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఏదో ఒకరోజు పార్క్ వే నిష్క్రమణ తప్పకపోవచ్చు’’ అని ఈ వ్యవహారాన్ని మొదటి నుంచీ పరిశీలిస్తున్న వ్యక్తులు ‘సాక్షి’తో చెప్పారు.
నిజానికి అరబిందో ఫార్మా ప్రమోటర్లు రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యక్తిగత హోదాలో కాంటినెంటల్ ఆసుపత్రిలో మెజారిటీ వాటా తీసుకుంటున్నారని, నిర్వహణను గురునాథ్ రెడ్డికే వదిలేస్తారని కూడా వార్తలొచ్చాయి. ఇవన్నీ అవాస్తవాలని సంబంధిత వర్గాలు తేల్చేశాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రి ప్రస్తుతం 300 పడకలతో నడుస్తోంది. 2.95 ఎకరాల్లో విస్తరించిన దీని సామర్థ్యాన్ని 750 పడకలకు విస్తరించే అవకాశం ఉంది. 2015లో మెజారిటీ వాటాను కొన్నాక... సీఈఓగా గురునాథ్ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో గ్రూప్ సీఈఓ టాన్ సీ లెంగ్‌ను నియమించింది పార్క్‌వే. అంతేకాకుండా 2017లో అదనపు పెట్టుబడి ద్వారా వాటాను డైల్యూట్ చేసి మరో 1.3 శాతాన్ని కేటాయించుకుంది. దీంతో గురున్ రెడ్డి వాటా 47.7 శాతానికి పరిమితమయింది. ఆ తరవాత కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయటంతో ఆయన ఎన్‌సీఎల్‌టీని కూడా ఆశ్రయించారు. నిజానికి ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు చెందిన పార్క్‌వే దేశంలో పలు ఆసుపత్రుల్లో దూకుడుగా పెట్టుబడులు పెట్టినా... ఏ ఒక్కటీ కలిసి రాలేదనే చెప్పాలి. గ్లోబల్ హాస్పిటల్స్. కోల్‌కతాలోని అపోలోతో పాటు కాంటినెంటల్‌లో పెట్టుబడులు పెట్టగా... కోల్‌కతా అపోలో నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఇక గ్లోబల్ వ్యవహారం కూడా అంత సజావుగా ఏమీ లేదు. ఇపుడు కాంటినెంటల్ పరిస్థితీ అదే తీరుగా ఉంది.
‘కాంటినెంటల్’ చేతులు మారుతుందా?
Published Tue, Oct 8 2019 6:11 AM | Last Updated on Tue, Oct 8 2019 6:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment