మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో సహ పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేశ్‌రెడ్డితో పాటు వనపర్తి జిల్లాకు ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు సైతం కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు సోమవారం ఢిల్లీ వేదికగా పార్టీ పెద్దల సమక్షంలో వెల్లడించారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతల పార్టీ మార్పుపై కొన్ని నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జూలై 14న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో వీరంతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొంది.
సొంత బలాన్ని ప్రదర్శించేలా..
మాజీ మంత్రి జూపల్లి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, వనపర్తి జిల్లా పెద్దమందడి ఎంపీపీ తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ సానే కిచ్చారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి, ఇతర నేతలంతా ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జ్ ఠాక్రే సమక్షంలో సోమవారం చర్చలు జరిపి తామంతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. అయితే ఢిల్లీలోనే పార్టీ పెద్దల సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకుంటారని భావించగా, స్థానికంగానే ప్రజల మధ్య పార్టీ మారాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జూలై 14 కొల్లాపూర్ వేదికగా భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా తమ సత్తా చాటాలనే యోచనలో జూపల్లితో పాటు ఇతర నేతలున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను ఆహ్వానించి ఆయన సమక్షంలో కండువా కప్పుకుంటామని చెబుతున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో..
బీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత ఇతర పార్టీలోకి వెళ్లే అంశంపై మాజీ మంత్రి జూపల్లి మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ మార్పుపై మాత్రం ఎప్పుడూ పెదవి విప్పలేదు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీలో చేరుతారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో చేరేందుకే వేగంగా పావులు కదిపారు.
కొత్త నేతలతో కలసివచ్చేనా?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేర నుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వీరి రాకతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరుతున్న నేతలు తమ సొంత బలంతో పాటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కేడర్ తమకు ఏ మేరకు కలసి వస్తుందోననే అంచనాలో ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో వీరికి పార్టీలోని పాత నేతలు ఎంత మేరకు సహకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కొడంగల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆయన ముఖ్య అనుచరులు కోస్గి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కూర అన్న కిష్టప్ప, కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ కూడా కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండాలని జూపల్లి భావిస్తుండగా, స్థానిక నేత చింతలపల్లి జగదీశ్వరరావు మాత్రం ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తానే బరిలో ఉంటానని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం తనకే వస్తుందని ఎమ్మెల్సీ కూచుకుళ్ల తనయుడు రాజేశ్‌రెడ్డి భావిస్తుండగా, రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్టు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి స్పష్టం చేస్తుండటం గమనార్హం. పార్టీ అధిష్టానం సూచన మేరకు నేతలంతా నడుచుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వనపర్తిలో చేరనున్న మేఘారెడ్డి సైతం తానే పోటీ చేస్తున్నట్టు చెబుతుండటంతో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిచేరికపై ఇంకా వీడని సస్పెన్స్..
నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ నుంచి తన కుమారుడు రాజేశ్‌రెడ్డికి టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తాను సైతం కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముందుగా తన కుమారుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే ఆ పార్టీలో చేరాలని దామోదర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు పదవికి రాజీనామా, కాంగ్రెస్‌లో చేరికపై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment