సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని సీనియర్ రాజకీయ నేతలు జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ దిశగా ఇరువురు నేతలు కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఇరువురు కాంగ్రెస్ గూటికే చేరనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
► గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం బీరం బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇరువురి మధ్యలో అంతర్గత పోరు నెలకొంది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు సీఎం కేసీఆర్‌పై జూపల్లి నేరుగా విమర్శనాస్త్రాలు సంధించిన నేపథ్యంలో పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు విధించింది. అప్పటినుంచి తాను ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నుంచి ఆహ్వానం అందినప్పటికీ కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీపై పెరిగిన అంచనాలు, స్థానిక పరిస్థితులు, అనుచరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై బీఆర్‌ఎస్‌లో చేరి రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
శనివారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవితో జూపల్లి, కూచుకుళ్ల వేర్వేరుగా భేటీ అయ్యారు. తాము పార్టీలో చేరితే దక్కే అవకాశాలు, హామీలు, ఇతర నేతల సహకారంపై చర్చించినట్టు తెలిసింది. ఈనెల 12న లేదా మరో నాలుగైదు రోజుల్లో ఇరువురు కాంగ్రెస్‌లో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వడివడిగా నేతల మంతనాలు..
కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఇరువురు నేతలు వడివడిగా మంతనాలు జరుపుతున్నారు. పలువురు నేతలతో ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్వయంగా కూచుకుళ్ల ఇంటికి వెళ్లినట్టు తెలిసింది.
సీఎం సభకు ముందు ఆయన్ను ఆహ్వానించేందుకు వెళ్లగా, గంటకు పైగా ఎమ్మెల్సీతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం. ఈసారి ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కోరగా దామోదర్‌రెడ్డి మాత్రం తానూ ఎన్నికల బరిలో ఉంటానని తేల్చిచెప్పినట్టు తెలిసింది. కాగా.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలపై మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి స్పందిస్తూ.. ఎమ్మెల్సీ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని, అయితే పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా సహకారం అందించాలని స్పష్టం చేశారు.
మరోవైపు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవితో పాటు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత జగదీశ్వర్‌రావుతో జూపల్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాను పార్టీలో చేరుతున్నానని, సహకారం అందించాలని కోరినట్టు తెలిసింది. పార్టీ ఎవరికి టికెట్టు ఇచ్చినా మద్దతుగా నిలవాలని జగదీశ్వర్‌రావు చెప్పినట్టు సమాచారం. అయితే తానే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో ఉంటున్నట్టు జగదీశ్వర్‌రావు చెబుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment