
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ను వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మండల ప్రత్యేకాధికారులు ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి ఎక్కడైనా సమస్యలు, నిధుల అవసరం ఉంటే ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరాపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. రేషన్‌దుకాణాల ద్వారా ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తోంది, మండల ప్రత్యేక అధికారులు రేషన్‌షాపులను పర్యవేక్షించాలని, లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం సరఫరా చేస్తున్నందున పేదలు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. దిశ సమావేశం ఈనెల 16న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అధ్యక్షతన నిర్వహించనున్నందున కేంద్ర పథకాలు అమలుపై ఆయా శాఖలు పథకాలు ప్రగతిపై నోట్స్ అంద చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఆరోగ్యకర ఆరంభం ఆశాజనక భవిష్యత్ అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి గర్భంలో పుట్ట బోయే శిశువు నుంచి శిశువు పుట్టే వరకు తల్లి, శిశువు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. మాతా, శిశు మరణాలను నివారించాలన్నారు.