సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది పలు రంగాల్లో ఉద్యోగుల వేతనాలు సగటున 9.4 శాతం మేర పెరుగుతాయని ఏఓఎన్ ఇండియా కన్సల్టింగ్ నిర్వహించిన వేతన పెంపు సర్వే వెల్లడించింది. 20 భిన్న పరిశ్రమలకు చెందిన 1000 కంపెనీలను ఈ సర్వే పలుకరించింది. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని ఈ సర్వే తేల్చింది. ఇక గత ఏడాది దేశవ్యాప్తంగా ఉద్యోగుల వేతనాలు 9.3 శాతం పెరుగుతాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక మెరుగైన సామర్థ్యం కనబరిచేవారికి కంపెనీలు ఎప్పుడూ పెద్దపీట వేస్తాయని, వారికి సగటు వేతన పెంపు 15.4 శాతంగా ఉంటుందని సర్వే పేర్కొంది.
ఈ ఏడాది ప్రొఫెషనల్ సేవలు అందించే సంస్థల్లో వేతన పెంపు అత్యధికంగా 10.6 శాతంగా ఉంటుందని, కన్జూమర్ ఇంటర్‌నెట్ కంపెనీల్లో 10.4 శాతం, లైఫ్‌సైన్సెస్‌లో 10.3 శాతం, ఆటోమేటివ్, వాహన తయారీ కంపెనీల్లో 10.1 శాతం, కన్జూమర్ ఉత్పాదక సంస్థల్లో 10.2 శాతం, ఐటీ అనుబంధ సంస్ధల రంగంలో 9.6 శాతం మేర వేతనాల పెంపు ఉంటుందని అంచనా వేసింది. హైటెక్, ఐటీ పరిశ్రమలో వేతన పెంపు 9.5 శాతం ఉంటుందని పేర్కొంది.
నిర్మాణరంగంలో 9.3 శాతం, వినోద, ప్రచురణలు, కమ్యూనికేషన్ రంగంలో 9.1 శాతం మేర వేతనాలు పెరుగుతాయని తెలిపింది. ఆతిధ్య రంగం, రెస్టారెంట్లలో 9 శాతం, ఇంధన, రవాణా రంగాల్లో 9 శాతం, ఇంజనీరింగ్ సేవల్లో 8.9 శాతం, ఆర్థిక సంస్థల్లో 8.5 శాతం, సిమెంట్ రంగంలో 8.4 శాతం చొప్పున వేతన పెంపు ఉంటుందని సర్వే అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment