'అనందంలో'.. ఫిన్‌ల్యాండ్‌ మొదటి స్థానం! మరి ఇండియా..?? | World Happiness Report 2024: Finland Is The Happiest Country In The World Again, See Details Inside - Sakshi
Sakshi News home page

World Happiness Report 2024: 'అనందంలో'.. ఫిన్‌ల్యాండ్‌ మొదటి స్థానం! మరి ఇండియా..??

Published Thu, Mar 21 2024 11:49 AM | Last Updated on Thu, Mar 21 2024 12:47 PM

World Happiness Report 2024: Finland Is The First Place - Sakshi

మార్చి, 20 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'

World Happiness Report 2024

"అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.." అని ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం సముద్రాల రామానుజాచార్య ఓ పాట రాశారు. ఆ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచి, ఆలపించారు ఘంటసాల. ఇది 1973లో వచ్చిన 'బతుకుతెరువు' సినిమాలోనిది. పాట చివర్లో "జీవితమే ఒక నాటకరంగం" అంటారు. నాటకం వంటి జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒకరోజు తెరపడుతుంది. అది తప్పదు. పుట్టినప్పటి నుంచి పోయేంత వరకూ సాగే బతుకు నడుమ ఆనందాన్ని పోగుచేసుకొని అనుభవిస్తేనే ఆనందం. లేకపోతే, అంతా అయోమయం, విషాదం. ఈ జీవనసారాన్ని మన మహర్షులు, మహర్షుల వంటి మహాకవులు, మహనీయులు, మాననీయ మూర్తులు తెలుసుకున్నారు, మనసారా అనుభవించారు, ఆచరించండని మనకు అనేక రూపాల్లో, మార్గాల్లో చెప్పారు. మార్చి, 20 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'.

మనుషులంతా సంతోషంగా ఉండండి, అది అందరికీ పంచండి, అది ఎక్కుడుందో వెతికి పట్టుకోండి, పట్టుకొని వదలకండి.. అంటూ ఐక్యరాజ్య సమితి అంటోంది. సుమారు ఓ పుష్కరం క్రితం (2013) తొలిసారిగా, సమితిలోని సభ్యదేశాలన్నీ ఈ వేడుకను జరుపుకున్నాయి. అప్పటి నుంచి ప్రతి ఏడూ జరుపుకుంటున్నాయి. బుధవారం నాడు అందరం జరుపుకున్నాం. కానీ, అందరికీ ఈ ఉత్సవం గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ స్థాయిలో  ప్రచారం జరుగలేదు. మనదేశంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో.. మనం ఈ ఆనంద సంబరాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోయాం.

ఈ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడూ కొన్ని నివేదికలు అందుతూ వుంటాయి. ఏ ఏ దేశాలలో సంతోష, ఆనందాల స్థాయి ఎట్లా వుందని కొలుస్తారు. ఆ కొలతలకు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఈ నియమాల ప్రకారం నివేదిక ద్వారా మనకు అర్థమవుతున్నదేంటంటే? అనందంలో మనదేశం 126 వ స్థానంలో వుంది. మనకంటే ఎంతో పేద దేశాలు ముందు వరుసలో వున్నాయి. మన పొరుగు దేశాలైన చైనా, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ మనకంటే ఆనందంగా వున్నాయి. మొత్తం దేశాలలో ఫిన్ ల్యాండ్ అందరికంటే ఆనందమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు ఏడేళ్ల నుంచి ఫిన్ ల్యాండ్ తన అగ్రతను కాపాడుకుంటూ వస్తోంది. 60 వ ర్యాంక్ తో మనకంటే చైనా చాలా ఆనందంగా ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది.

క్షేత్రస్థాయిలో, నిజజీవితంలో వాస్తవాలు మనకు పూర్తిగా తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపిన సంస్థ చెప్పే నివేదికలో మాత్రం విషయాలు అలాగే వున్నాయి. ప్రపంచ మానవాళికి శాంతిని, ఆనందమయ జీవితాన్ని చాటి చెప్పామని చెప్పుకుంటున్న మన దేశం ఈ సూచీలో వెనుకబడి పోవడం వివిధ ఆలోచనలను రేకెత్తిస్తోంది. అంతర్ముఖంగా మళ్ళీ అలోచించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఏది ఆలోచిస్తే, ఏది చేస్తే, ఏది చూస్తే ఆనందం కలుగుతుందో? అవన్నీ మన మహర్షులు మనకు ఎన్నడో చెప్పేశారు. భగవద్గీత నుంచి సంగీతం వరకూ, ధ్యానం నుంచి యోగాభ్యాసం వరకూ, మౌనం నుంచి ఆధ్యాత్మిక సాధన వరకూ, శాంతి నుంచి స్థితప్రజ్ఞత వరకూ మనకు బోధించారు. వాటిని కొందరు ఆచరించారు, కొందరు ఆచరించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. కొందరు ఇవ్వేమీ తెలియకుండానే సహజంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు.

మొత్తంగా చూస్తే ఎక్కువమంది ఆనందంగా లేరు. అసంతృప్తితో అలమటిస్తున్నారు, అయోమయంలో వున్నారు. ఐక్యరాజ్య సమితి పెట్టిన నియమాలను ఒకసారి వీక్షిద్దాం. ఆత్మతృప్తి, జీవనకాలం (లైఫ్ స్పాన్), సామాజిక మద్దతు, తలసరి ఆదాయం, దాతృత్వం, స్వేచ్ఛ, అవినీతి మొదలైన వాటిల్లో ఆయా దేశాలు, ఆయా దేశ ప్రజలు ఎలా వున్నారన్నది ప్రాతిపదికగా దేశాలకు ర్యాంకులను కేటాయించారు. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ వంటి దేశాలలో కూడా సంతోషం సన్నగిల్లుతోందని ఈ నివేదిక చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న దేశాలే ఎక్కువ ఆనందంగా వున్నాయి. "చిన్న కుటుంబం - చింతలులేని కుటుంబం " అన్న పాత సామెత గుర్తుకువస్తోంది.

అనందాన్ని అనుభవించేవారి వయసుల్లోనూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరు నడుస్తోంది. పెద్ద వయస్సు వారికంటే చిన్నవాళ్లే ఆనందంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నా, అన్నిచోట్లా అట్లా లేదు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాల్లో యువత కంటే పెద్దలే ఎక్కువ ఆనందంగా వున్నారు. ఐరోపా వాసుల్లో ఆనందం కాస్త పెరుగుతున్నట్లు, పశ్చిమ యూరప్ లో అందరూ సమానమైన సంతోషకర వాతావరణంలో వున్నారని తెలుస్తోంది. ఒక్క ఐరోపా దేశాల్లో తప్ప మిగిలిన అన్ని దేశాలలోనూ ఆనందంలో అసమానతలు పెరిగిపోతూ ఉండడం బాధాకరం. అందులో మనదేశం కూడా వుండడం ఇంకా బాధాకరం.

అందరి కంటే అత్యంత ఆనందంగా వున్న ఫిన్ ల్యాండ్ ప్రజలను గమనిస్తే వారి లక్షణాలు, ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రకృతితో ఎక్కువ మమేకమై ఉండడం, వృత్తిని - జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ, సమతుల్యత పాటిస్తూ సాగడం, విజయంపై స్పష్టమైన అవగాహన కలిగివుండడం, అవినీతి తక్కువగా ఉండడం, ప్రభుత్వాల పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి వుండడం, ఆరోగ్యం, విద్య, సంరక్షణలో ప్రభుత్వం సక్రమంగా పరిపాలన, సేవలు అందించడం మొదలైనవి ఫిన్ ల్యాండ్ వారి ఆనందమయ జీవితానికి కారకాలుగా, ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి. 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎజెండా పెట్టుకుంటున్నాం.

"అనందానికి తిరిగి దగ్గర కావడం - స్థితప్రజ్ఞత కలిగే, పెరిగే సమాజాలు నిర్మించుకోవడం" ఈ 2024 సంవత్సరానికి పెట్టుకున్నాం. ఇది సాధించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే వుంది. మన ఆలోచనలలో వుంది, మన ఆచరణలో, నడవడికలో వుంది. రమణమహర్షి నుంచి రామానుజాచార్యులు (సముద్రాల) వరకూ, మహాత్మాగాంధీ నుంచి మార్క్ ట్వైన్ వరకూ, ఆదిశంకరాచార్యుల నుంచి అబ్రహం లింకన్ వరకూ, లియో టాల్ స్టాయ్ నుంచి జాన్ కీట్స్ వరకూ చెప్పింది ఒక్కటే! "ఆనందంగా ఉండండి, తోటివారిని అనందంగా ఉంచండి ".

ఈ క్రమంలో, మనకు బోలెడు సారస్వతం వుంది, కళలు వున్నాయి, భగవద్గీత, మహాభారత రామాయణాది కావ్యాలు, ఇతిహాసాలు, వేదవేదాంగాలు అందించిన జ్ఞానభాండాగారం మన దేశానికి మెండుగా అండగా వుంది. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి జారుకొనేంత వరకూ ఏమేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యకూడదో ఆచార్యులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతూనే వున్నారు. ఆహారం, నిద్ర, వ్యాయామ నియమాలు, శాంతి, విశ్రాంతిని ఆచరించడం మన చేతుల్లోనే వుంది. ప్రతి మనిషి కోరుకొనేది ఒక్కటే.. ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. అదే జీవిత మకరందం. ఈ ఆనంద సూచీలో మనం ఫిన్ ల్యాండ్ ను దాటి మొదటి స్థాయిని అందుకోవాలి. అందరూ అనందంగా ఉండాలని అనుకుందాం.

— మా శర్మ, సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement