ఖమ్మం: ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక మొదలు బలాబలాలు తెలుసుకునేందుకు సర్వే చేయించుకోవడం పరిపాటిగా మారింది. సర్వేల్లో వచ్చిన ఫలితాలను సమీక్షించుకుంటూ ఎక్కడ బలహీనంగా ఉన్నామో సరిచేయించుకోవడంలో ఆశావహులు నిమగ్నమయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు, ఆశావహులు నెలకు రెండు, మూడు సార్లు సర్వే చేయించుకుంటూ గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు.
ఫలానా పార్టీ, ఫలానా అభ్యర్థి బలం గత నెలలో ఇలా ఉండగా.. ఈసారి పెరిగింది, లేదంటే తగ్గింది అని ఎదుటి వర్గం వారు ప్రచారం చేస్తున్నారు. ఇక సొంత పార్టీల వారైతే తమ అభ్యర్థి, నేత బలం పెరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఎన్నికల రంగంలో దూసుకెళ్తున్నారు.
సొంత సర్వేలతో బిజీ
ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో సంస్థకు సర్వే బాధ్యతలను అప్పగించింది. అయితే, పోటీ చేసే అభ్యర్థులు సైతం సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి ఫలానా అభ్యర్థి పోటీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.. అధికార పార్టీ అభ్యర్థి అనుకూల అంశాలు ఏమిటి... పోటీలో ఎవరెవరు ఉంటారు, ఎవరికి గెలిచే అవకాశముందందనే అంశాలపై సర్వే చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారు.
సమాచారం ఉంది...
సర్వే చేయించుకున్న నేతలు ఏ గ్రామంలో ఏ పార్టీ, ఏ నాయకుడికి ఎంత ఇమేజ్ ఉందో తెలుసుకుంటున్నారు. అనంతరం ఆ గ్రామానికి వెళ్లినప్పుడు సమాచారం తన వద్ద ఉందని చెబుతూ సర్వే చేసిన వారికి ఎవరెవరు ఏం చెప్పారో కూడా తెలుసు.. ఇకనైనా సీరియస్‌గా పని చేయకపోతే ఫలితాలు మారనున్నందున తీరు మార్చుకోవాలని సూచనలు చేస్తున్నట్లు తెలిసింది.
జర జాగ్రత్త
సర్వే కోసం ఎవరైనా వస్తే వారు అడిగిన ప్రశ్నలకు ఇష్టముంటే సమాధానం చెప్పడం లేదంటే దాటవేయడమే మంచిదని పలువురు సూచిస్తున్నారు. అలాకాకుండా ఏదో ఒక మాట అంటే సరిపోతుందిగా అనే భావనతో సమాధానమిస్తే సదరు వ్యక్తి ఫలానా పార్టీకి అనుకూలమనే ముద్ర వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నలుగురు కూడిన చోట రాజకీయాలపై చర్చించడం.. అదికాస్తా పెద్దదై నిందించుకోవడం ఇటీవల సాధారణమైందని తెలుస్తోంది. ఎవరైనా అతి ఉత్సాహంతో మాట్లాడితే సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సంబంధిత నాయకులకు చేరవేస్తున్నట్టు సమాచారం.
ప్రామాణికత ఉందా?
ఒకప్పుడు సర్వేలకు ప్రాధాన్యత ఉండగా.. నివేదికలకు ఒక కచ్చితత్వం ఉంటుందని నమ్మేవారు. కానీ రానురాను ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా సర్వే నివేదికలు వస్తుండడంతో ప్రజలు విశ్వసించడం లేదు. సర్వే చేయించిన వ్యక్తికి అనుకూలంగా నివేదిక ఇవ్వకపోతే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భావనతో నిర్వాహకులు అదే మాదిరి చేస్తున్నట్లు సమాచారం. ఇక 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓ సంస్థ ఇచ్చిన సర్వే నివేదిక ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు పందేలు కాసి భారీగా నష్టపోయి ఇప్పటికీ కోలుకోలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయి మానసికంగా కుంగిపోయిన వారు పలువురు కనిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment