కోలా సిద్ధార్థ, ఇసరం వికాస్ (ఫైల్)
ఖమ్మం: బాతు పిల్లతో ఆడుకుందామనుకున్నారు.. దానిలా నీటిలో అటూ.. ఇటూ.. తిరుగుదామనుకున్నారు.. కానీ, బాతును తేలియాడనిచ్చిన నీరు చిన్నారులను ముంచేసింది.. ముక్కు పచ్చలారని చిన్నారులను.. బంగారు భవిష్యత్ ఉన్న ఆ పిల్లలను విగతజీవులుగా మార్చింది.. వారి మృతదేహాలను చూసిన తల్లిదండ్రు లు గుండెలు బద్ధలయ్యేలా విలపించారు.. దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు.. హాహాకారాలు చేస్తూ గుండెలు బాదుకున్నారు.. వీరి ఆర్తనాదాలతో సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగింది.
ఎస్సీకాలనీకి చెందిన కోలా సిద్ధార్థ (12), ఇసరం వికాస్ (7), చేవల రుషి కలిసి ఇళ్లకు సమీపంలో ఉన్న హెచ్.పుల్లయ్య వరిపొలంలోని నీటిగుంత దగ్గరికి వెళ్లారు. వికాస్ బాతుపిల్ల కాలికి తాడు కట్టి నీళ్లల్లో ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో రాయిపై నిల్చొని వంగి ఆడిస్తుండగా జారిపోయాడు. గమనించిన సిద్ధార్థ.. వికాస్ కాళ్లను పట్టుకొని కాపాడే యత్నంలో ఆతను కూడా నీటిలో పడిపోయాడు. ఒడ్డున ఉన్న రుషి పరిగెత్తుకుంటూ వచ్చి సమీపంలో వాలీబాల్ ఆడుతున్న వికాస్ తండ్రి శ్రీను, యువకులకు చెప్పాడు. హుటాహుటిన వారు వెళ్లి నీటిలో మునిగిన సిద్ధార్థ, వికాస్‌ను బయటకు తీసి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కూలి పనులే ఆధారం..
మృతుడు కోలా సిద్ధార్థ తండ్రి మహేశ్ ఆటోడ్రైవర్. తల్లి నాగమణి వ్యవసాయ కూలీ. వికాస్ తండ్రి శ్రీను ఐరన్ రాడ్‌బెండింగ్ వర్కర్. తల్లి గంగ కూలి పనులు చేస్తుంటారు. ఆదివారం సెలవు కావటంతో పిల్లలు ముగ్గురు ఎప్పటిలాగే ఆడుకోవటానికి వెళ్లారు. సిద్ధార్థ 6వ తరగతి, వికాస్ ఒకటో తరగతి కాకర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సిద్ధార్థకు తమ్ముడు బాలు, వికాస్‌కు తమ్ముడు వెంకట్ ఉన్నారు. ఇద్దరు ఒకే వీధి పిల్లలు మృతిచెందటంతో కాకర్లపల్లి ఎస్సీకాలనీ కన్నీటిసంద్రమైంది. సత్తుపల్లి పట్టణ సీఐ మోహన్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాల నుంచి వివరాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment