ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పవర్‌.. ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోండి.. | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పవర్‌.. ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోండి..

Published Wed, Oct 11 2023 8:18 AM | Last Updated on Wed, Oct 11 2023 10:31 AM

- - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌, పక్కన సీపీ వారియర్‌, అధికారులు

ఖమ్మం: ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతోనే కోడ్‌ అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పవర్‌ ఉంది. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. గత ఎన్నికల్లో జిల్లాలో 90 శాతం వరకు పోలింగ్‌ నమోదు కాగా, ఈసారి మరింత పెరిగేలా అవగాహన కల్పిస్తున్నాం... అని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వీ.పీ. గౌతమ్‌ తెలిపారు. సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌తో కలిసి ఆయన జెడ్పీ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు.

ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లోని రాజకీయ నేతల ఫ్లెక్సీల తొలగింపు, విగ్రహాలకు ముసుగు కప్పడం వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో సభలు, సమావేశాల నిర్వహణ, సొంత ఖర్చులతో హోర్డింగ్స్‌ పెట్టుకోవాలనుకునే వారు మున్సిపాలిటీల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఖమ్మంకు మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, వైరాకు అదనపు కలెక్టర్‌, సత్తుపల్లికి కల్లూరు ఆర్డీఓ, మధిరకు ఖమ్మం ఆర్డీఓ, పాలేరుకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌ఓలుగా వ్యవహరిస్తారని చెప్పారు.

డబ్బు, మద్యం పంపకంపై సమాచారం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్‌ సీ విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. కాగా, కొత్త కోడళ్లు తమ పుట్టింటి నుంచి ఓటు హక్కును అత్తింటి వద్దకు మార్చుకోవడానికి ఫామ్‌–18ను దరఖాస్తు చేసుకోవాలని, వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసుకునే హక్కు ఉందని చెప్పారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఐదు మోడల్‌పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వివరించారు.

జింకలతండా గోదాంలో లెక్కింపు
వచ్చేనెల 30న పోలింగ్‌ ముగిశాక ఈవీఎంలను రఘునాథపాలెం మండలం జింకలతండాలోని గోడౌన్‌కు తరలిస్తామని కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జిల్లాలో గతంతో పోలిస్తే 63 పోలింగ్‌కేంద్రాలు పెరగగా, ఓటర్లకు ఇబ్బంది రాకుండా అన్ని ఆవాసాల్లో పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ మాట్లాడుతూ సోమవారం జిల్లావ్యాప్తంగా రూ.53 లక్షలు సీజ్‌ చేసి 17 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

గత ఎన్నికల్లో 10 వేల మందిని బైండోవర్‌ చేయగా, ఈసారి వారంలోగా ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఇక జిల్లాలో 131 మంది గన్‌ లైసెన్స్‌ కలిగి ఉండగా.. 128 మంది వద్ద తుపాకులు ఉన్నాయని చెప్పారు. వీరిలో బ్యాంక్‌ లైసెన్స్‌దారులు మినహా మిగతా వారు డిపాజిట్‌ చేయాలని సూచించినట్లు తెలిపారు. జిల్లాలో 390 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లుచేయనున్నట్లు చెప్పారు.

కొత్త జాబితాలో తొలగింపులు ఉండవు..
ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు తప్పక పాటించాలని కలెక్టర్‌ గౌతమ్‌ సూచించారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సీపీ వారియర్‌తో కలిసి సమావేశమైన ఆయన మాట్లాడారు. కొత్తగా ఓటరు జాబితాలో తొలగింపులకు అవకాశం లేకపోగా, అర్హులు ఉంటే పేర్ల నమోదుకు అవగాహన కల్పించాలని సూచించారు.

అనంతరం వ్యయ పర్యవేక్షణ అమలు కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అనుమానాస్పద లావాదేవీలపై రిటర్నింగ్‌ అధికారులకు బ్యాంకర్లు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వైన్స్‌లో అమ్మకాలకు సంబంధించి గత మూడు నెలల నివేదిక సేకరించాలన్నారు.

ఎంసీఎంసీ ప్రారంభం..
కలెక్టరేట్‌లోని జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ – మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ) సెల్‌ను కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ వారియర్‌ ప్రారంభించారు. ఎన్నికల సంబంధ వార్తలపై నిఘా వేయడమే కాక ఫిర్యాదులపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు ఏర్పాటుచేసిన ఎంసీసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎస్‌టీ బృందాలకు కేటాయించిన వాహనాలను కలెక్టర్‌ ప్రారంభించారు.

జిల్లాలో 15 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 24 ఎంసీసీ, 15 ఎస్‌ఎస్టీ బృందాలను ఏర్పాటుచేశామని, ఈ బృందాలు షిఫ్ట్‌ల వారీగా 24గంటలు పనిచేస్తాయని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, అడిషనల్‌ డీసీపీ ప్రసాదరావు, వ్యయ పర్యవేక్షణ జిల్లా నోడల్‌ అధికారి సాయికుమార్‌, డీటీఓ కిషన్‌రావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నాగేందర్‌రెడ్డి, డీసీఓ విజయకుమారి, ఎల్‌డీఎం శ్రీనివాసరెడ్డి, ఏసీపీ గణేష్‌, డీఆర్డీఓ విద్యాచందన, సీపీఓ ఏ.శ్రీనివాస్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుమనోహర్‌, డీపీఆర్వో ఎం.ఏ.గౌస్‌, ఏపీఆర్వో వి.శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

1950, 90632 11298 నంబర్లతో కంట్రోల్‌రూం
ఎన్నికల నేపథ్యాన కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ వారియర్‌ పరిశీలించారు. ఏ ఫిర్యాదు ఏ అధికారికి అందజేయాలో చార్జ్‌ ఏర్పాటుచేయాలని సూచించారు. ఓటర్లు తమ ఫిర్యాదులను 1950, 90632 11298 నంబర్లకు ఇచ్చేలా ప్రచారం చేయాలని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement