సాక్షి, ముంబై: కరోనా కల్లోల సమయంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎల్) నికర లాభం భారీగా పడిపోయింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 19శాతం క్షీణించి 962 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇది 1,195 కోట్లుగా ఉంది. కోవిడ్-19 సంక్షోభం తమ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీసిందని ప్రకటించింది.
కంపెనీ నికర వడ్డీ ఆదాయం మాత్రం12 శాతం ఎగిసి 3,694 కోట్ల నుంచి 4,152 కోట్లకు పెరిగింది. అలాగే ఆపరేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం 15 శాతం పుంజుకుని 6648 కోట్ల రూపాయలను నమోదు చేసింది. 2020, ఏప్రిల్ 30 నాటికి ఏకీకృత మారటోరియం బుక్ 38,599 కోట్ల రూపాయల నుండి 21,705 కోట్లకు తగ్గిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.
మరోవైపు బజాజ్ ఫైనాన్స్ కంపనీ ఆరంభం(1987) నుంచి ఛైర్మన్‌గా కొనసాగుతున్న రాహుల్ బజాజ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మూడు దశాబ్దాలకు పైగా సంస్థను అభివృద్దిపథంలో పరుగులు పెట్టించిన ఆయన జూలై 31 నుంచి తన పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నారు. అయితే నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తన సేవలను కొనసాగిస్తారు. కంపెనీ వైస్ ఛైర్మన్, రాహుల్ బజాజ్ కుమారుడు ఛైర్మన్‌గా సంజీవ్ బజాజ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు 4 శాతం నష్టాలతో ముగిసింది.
తండ్రితో సంజీవ్ బజాజ్ (ఫైల్ ఫోటో)
Comments
Please login to add a commentAdd a comment